SECI power purchase agreement: రూ.1.10 లక్షల కోట్లు.. ఇదీ జగన్‌ పాపం ఖరీదు!

సెకి విద్యుత్‌ ఒప్పందం అసలు స్వరూపం మేడిపండు సామెతను తలపించేలా ఉంది. సెకి నుంచి యూనిట్‌ విద్యుత్‌ను   రూ.2.49 చొప్పున చౌకగా కొంటున్నామనే జగన్‌ సర్కార్‌ చెప్పింది.

Updated : 11 Jul 2024 04:31 IST

సెకితో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఫలితం
అదనపు భారాలతో కలిపి యూనిట్‌ ధర రూ.5.73

ఈనాడు, అమరావతి: సెకి విద్యుత్‌ ఒప్పందం అసలు స్వరూపం మేడిపండు సామెతను తలపించేలా ఉంది. సెకి నుంచి యూనిట్‌ విద్యుత్‌ను   రూ.2.49 చొప్పున చౌకగా కొంటున్నామనే జగన్‌ సర్కార్‌ చెప్పింది. జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఛార్జీలు, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన ప్లాంట్ల నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం గురించి గుట్టుగా ఉంచింది. ఈ అదనపు భారం యూనిట్‌కు రూ.3.24 చొప్పున పడుతుంది. రెండూ కలిపి యూనిట్‌కు రూ.5.73 అవుతుంది. ఆ అదనపు భారాల విలువ.. 25 ఏళ్లలో రూ.1,10,160 కోట్లు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి సెకి సంస్థ విద్యుత్‌ సరఫరా ప్రారంభించనుంది.

  • మాన్యుఫ్యాక్చరింగ్‌ లింక్డ్‌ స్కీం కింద ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని.. దీనివల్ల సెకి విద్యుత్‌పై అదనపు భారాలు ఉండవని గత ప్రభుత్వం చెప్పింది. కానీ, సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు అదనపు భారాలను భరించక తప్పదు. ఆ వివరాలు.. 
  • సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీసీఎల్‌) పార్కును అభివృద్ధి చేస్తుంది. వాటిలో సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటుచేసే సంస్థల నుంచి మెగావాట్‌కు రూ.42 లక్షల చొప్పున ఏపీఎస్‌పీసీఎల్‌ వసూలు చేస్తుంది. సెకి సంస్థ రాజస్థాన్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల సౌరపార్కుల అభివృద్ధి ఛార్జీలను ఏపీఎస్‌పీసీఎల్‌ నష్టపోతుంది. ఈ రూపేణా యూనిట్‌కు సగటున వచ్చే నష్టం 30 పైసలు.
  • సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసే ఖర్చుపై జీఎస్టీ కింద వసూలుచేసే మొత్తంలో రాష్ట్రప్రభుత్వ వాటా 7% వస్తుంది. ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటుచేయడం వల్ల.. జీఎస్టీ రూపేణా మెగావాట్‌కు రావాల్సిన సుమారు రూ.24 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. అది యూనిట్‌కు సగటున 17 పైసలు.
  • సౌర ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటుచేస్తే 3% అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా నష్టాల భారం తగ్గేది. ఆ భారం యూనిట్‌కు 27 పైసలు పడనుంది.
  • జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ (జీఎన్‌ఏ) ఛార్జీల పేరుతో యూనిట్‌కు సగటున పడే భారం రూ.2.50. ఈ భారం ప్రజలపై పడుతుందన్న విషయాన్ని గత ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం మెగావాట్‌కు రూ.50 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

25 ఏళ్లలో.. ఎంత భారం!

  • ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 3వేల మెగావాట్ల విద్యుత్‌ను సెకి సరఫరా చేయబోతోంది. మెగావాట్‌కు ఏడాదికి 20 లక్షల యూనిట్ల విద్యుత్‌ వస్తుంది. ఈ లెక్కన 3వేల మెగావాట్లకు.. ఈ ఏడాది సెప్టెంబరులో 600 కోట్ల యూనిట్లను సెకి సరఫరా చేస్తుంది. యూనిట్‌కు అదనపు ఛార్జీలు రూ.3.24 చొప్పున.. ప్రజలపై పడబోయే భారం రూ.1,944 కోట్లు. 
  • సెకి ఒప్పందం ప్రకారం 2025 సెప్టెంబరు నుంచి మరో 3వేల మెగావాట్ల విద్యుత్‌ వస్తుంది. దానికి రూ.3,888 కోట్లు అదనపు ఛార్జీలుగా చెల్లించక తప్పదు. 
  • 2026 సెప్టెంబరులో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ రానుంది. ఆ విద్యుత్‌కు రూ.4,536 కోట్ల భారం అదనంగా పడుతుంది. 
  • 2027 నుంచి.. రాబోయే 22 ఏళ్లకు అదనపు ఛార్జీల కింద రూ.99,792 కోట్లు చెల్లించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని