Coal mines: మళ్లీ తెరపైకి ‘సోమవరం’ బొగ్గు నిల్వలు!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం అటవీ ప్రాంతంలో బొగ్గు నిల్వల అంశం సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టగా ఆ జాబితాలో 44, 45 స్థానాల్లో చింతలపూడి సెక్టార్‌ ఎ-1(ఎస్‌డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్‌ ఎ1(ఎస్‌ఈ) ఉన్నాయి.

Updated : 24 Jun 2024 06:01 IST

తాజా వేలం జాబితాలో స్థానం 

చాట్రాయి, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం అటవీ ప్రాంతంలో బొగ్గు నిల్వల అంశం సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టగా ఆ జాబితాలో 44, 45 స్థానాల్లో చింతలపూడి సెక్టార్‌ ఎ-1(ఎస్‌డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్‌ ఎ1(ఎస్‌ఈ) ఉన్నాయి. గతంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన వేలం జాబితాలో సోమవరం పశ్చిమ ప్రాంతంలో తడికలపూడి, చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ గనుల వేలానికి ఎవరూ ముందుకు రాకపోగా తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ పోటీలో లేదు. ఫలితంగా వేలం వాయిదా పడింది. ఇక్కడి 2 గనులను సింగరేణి తీసుకుంటే రవాణాకు ఇబ్బంది ఉండదనే చర్చలూ జరిగాయి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 15 ఏళ్ల క్రితం సర్వే కూడా చేశారు. ఇక్కడి బొగ్గు నమూనాలు పరిశీలించి ‘గ్రేడ్‌-1’ తేల్చారు. దాదాపు 50 ఏళ్లకు సరిపడా నిల్వలున్నట్లు ఎంఈసీఎల్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు పనులన్నీ కావడంతో తవ్వకాలు మొదలుపెడతారని అనుకున్నా.. ఆ దిశగా అడుగు పడలేదు. రాష్ట్ర విభజనతో ఈ అంశమే తెరమరుగైంది. దేశవ్యాప్తంగా గనులు వేలం వేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడి బొగ్గు నిల్వల అంశం తెరపైకి వచ్చింది. కొత్త బొగ్గు గనుల్ని అన్వేషించాలని కేంద్ర గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులకు శనివారం సూచించారు. హైదరాబాద్‌లో ఆయన జీఎస్‌ఐ దక్షిణ భారత, తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని