నల్లబజారులో రెమ్‌డెసివిర్‌

కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయాలు నల్లబజారులో యథేచ్ఛగా సాగుతున్నాయి. కొవిడ్‌ కేసులు ఎక్కువయ్యే కొద్దీ...

Updated : 26 Apr 2021 08:22 IST

ప్రాణభయంతో ఔషధానికి పెరుగుతున్న డిమాండ్‌
భారీగా డబ్బు గుంజుతున్న దళారులు

* గుంటూరు జిల్లాలో ఓ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితుడికి అత్యవసరంగా ‘రెమ్‌డెసివిర్‌’ ఇంజక్షన్‌ ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారు. ‘ఇంజక్షన్లు మీరే తెచ్చుకోవాలి. మా దగ్గర స్టాకు లేదు’ అని చెప్పడంతో రోగి కుటుంబసభ్యులు హైరానా పడ్డారు. తెలిసిన వారి ద్వారా రకరకాలుగా రెమ్‌డెసివిర్‌ కోసం ప్రయత్నించారు. చివరకు రెండు ఇంజక్షన్లను ఒక్కోదాన్నీ రూ.18 వేలకు కొనుగోలు చేశారు.

* వైరస్‌ బాధితుడొకరికి రెమ్‌డెసివిర్‌ అవసరం కావడంతో కుటుంబసభ్యులు మధ్యవర్తిని సంప్రదించారు. ఒక్కోదానికి రూ.40 వేలు చెల్లిస్తే.. 6 ఇంజక్షన్లు ఇస్తానని ఆయన చెప్పాడు. ఇటీవల తెలిసిన వారికి రూ.20 వేల చొప్పున తీసుకుని ఇచ్చావు కదా? అని కుటుంబసభ్యులు అడిగితే ‘ధరలు పెరిగాయి. అడిగినంత చెల్లిస్తేనే రెమ్‌డెసివిర్‌ ఇస్తా. ఇతర కంపెనీల ఇంజక్షన్లయినా ఫరవాలేదంటే రేటు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తా’ అని బదులిచ్చాడు. రాష్ట్రంలో సాగుతున్న రెమ్‌డెసివిర్‌ బేరసారాలకు దర్పణాలీ సంఘటనలు.

ఈనాడు, అమరావతి: కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయాలు నల్లబజారులో యథేచ్ఛగా సాగుతున్నాయి. కొవిడ్‌ కేసులు ఎక్కువయ్యే కొద్దీ... ఈ ఇంజక్షన్లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ బాధితుల ప్రాణభయాన్ని ఆధారంగా చేసుకొని దళారులు వేలాది రూపాయలు గుంజుతున్నారు.విశాఖ, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో నల్లబజారులో ఇంజక్షన్లను అమ్ముతూ పలువురు చిక్కారు. అయిన్పటికీ దందా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధరను రూ.2,500గా ఖరారుచేసింది. ఈ మేరకు ఉత్తర్వులూ జారీచేసింది. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులు, అనుబంధ గుర్తింపు లేని ఆసుపత్రులూ ఈ ధరనే పాటించాలని శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికిముందు ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400 దాకా ఉంది. మార్కెట్లో బ్రాండ్‌ను బట్టి ధరలు పెరుగుతున్నాయి. ఎక్కడా నిర్ణీత ధరకు ఈ ఔషధం దొరకడం లేదు. ఓ కంపెనీ ఔషధం అసలు ధర రూ.1,680 ఉండగా అది చేతులు మారుతూ వినియోగదారుడికి చేరేసరికి రూ.5 వేలు దాటింది.

ఇంజక్షన్‌ మీరే తెచ్చుకోవాలి
అవసరాన్ని బట్టి ఒక్కో రోగికి కనీసం ఐదు నుంచి ఆరు ఇంజక్షన్లు ఇస్తున్నారు. సాధారణంగా అత్యవసర చికిత్స పొందే వారికే వైద్యుల సలహా మేరకు ఈ ఇంజక్షన్లు ఇవ్వాలి. వీటిని చేయించుకున్న వారు కాస్త వేగంగా కోలుకుంటుండటంతో డిమాండ్‌ పెరిగింది. కరోనా వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో ఇవి దొరకడం లేదు. ఔషధాన్ని తెచ్చుకుంటే రోగికి ఇస్తామని సంబంధిత కుటుంబసభ్యులకు వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఈ ఇంజక్షన్‌ కోసం మందుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నిష్ఫలమే అవుతోంది. మరోపక్క ఇవి నల్లబజారులో దొరుకుతున్నాయి. కొద్దిరోజుల కిందట గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఆసుపత్రి ఉద్యోగి నుంచి ఆరు వయల్స్‌ను ఔషధ నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.15 వేల చొప్పున వీటిని విక్రయించేందుకు ఆ ఉద్యోగి నేరుగా అధికారులకే బేరం పెట్టాడు. గుంటూరులో ఇంకా ప్రారంభించని మందుల దుకాణానికి చెందిన ఒకరి నుంచి 6 వయల్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఆయన కూడా ఒక్కోటీ రూ.15 వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఆసుపత్రుల నుంచి తెచ్చిన వాటినే వీరు విక్రయిస్తున్నారని భావిస్తున్నారు. విశాఖ, నెల్లూరులోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోనికి వచ్చాయి. పలుచోట్ల ఆసుపత్రుల సిబ్బంది.. రోగులకు ఇంజక్షన్లను చేయకుండానే... చేశామని చెప్పి డబ్బు తీసుకుంటున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల బంధం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్‌ చికిత్స చేసేందుకు అనుమతి పొందిన ఆసుపత్రుల నుంచి ఇండెంట్లు వస్తేనే స్టాకిస్టులు అందించాలి. అనధికారికంగా పలుచోట్ల కొవిడ్‌ చికిత్స సాగుతోంది. ఇలాంటి వారు అధికారికంగా చికిత్స అందించే ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పొందుతున్నారు. అనుమతి ఉన్న కొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ ఔషధానికి ఎక్కువ ధర వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రోగుల అవసరాలు, ఆత్రుతకు అనుగుణంగా ఈ ఇంజక్షన్లకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అధిక ధరలకు వీటిని కొనుగోలు చేసిన బాధిత కుటుంబాల వారు... ఆ వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు.

వచ్చేవి 6 వేల వయల్స్‌
రాష్ట్రానికి ప్రతిరోజూ హైదరాబాద్‌లోని ఓ కంపెనీ నుంచి 6 వేల వయల్స్‌ వస్తున్నాయి. ఇవి అవసరాలకు సరిపోవడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో రెండు కంపెనీల నుంచీ లోగడ ఔషధం వచ్చినప్పటికీ ఇప్పుడు సరఫరా తగ్గింది. కేంద్ర అనుమతులతో విశాఖ కేంద్రంగా మరో కంపెనీ రెమ్‌డెసివిర్‌ తయారీకి ఉపక్రమించింది. ఇది మార్కెట్లోకి వస్తే కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

తగ్గుతున్న నిల్వలు
ఈ నెల 17న ప్రభుత్వ డ్రగ్‌స్టోర్లలో 48,232, ఆసుపత్రుల్లో 2,124 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ ఉన్నాయి. శుక్రవారం ప్రభుత్వ డ్రగ్‌ స్టోర్లలో 30,003, ఆసుపత్రుల్లో 2,358 వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ‘4 లక్షల వయల్స్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. 15 వేల చొప్పున దశలవారీగా ఇవి అందుబాటులోకి వస్తాయి’ అని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

రెమ్‌డెసివిర్‌ సరఫరా పర్యవేక్షణకు జిల్లాకో నోడల్‌ అధికారి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా ఉద్ధృతి దృష్ట్యా రెమ్‌డెసివిర్‌ ఔషధం సరఫరా, సమన్వయం కోసం జిల్లాకు ఒకరు చొప్పున నోడల్‌, ఉప నోడల్‌ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరంతా ఔషధ నియంత్రణ శాఖకు చెందిన అధికారులు. రోజువారీ తరహాలో ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్లు రెమ్‌డెసివిర్‌ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని