Gopala Krishna Dwivedi: ఏపీఎండీసీని వాడేసుకున్న ద్వివేది

అధికారులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధానకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. వైద్యబిల్లుల కోసం దారితప్పారు.

Updated : 05 Jul 2024 06:47 IST

తల్లిదండ్రుల వైద్యఖర్చులు రూ.80 లక్షలు ఈ సంస్థ నుంచే 
అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండీ వెంకటరెడ్డి

ఈనాడు, అమరావతి: అధికారులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధానకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. వైద్యబిల్లుల కోసం దారితప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా, తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్‌ నుంచి పలుదఫాలుగా రూ.80లక్షలు తీసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా బయటకొచ్చింది. ద్వివేది నాలుగున్నరేళ్లపాటు గనులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూశారు. వైకాపా ‘ముఖ్య’నేతలకు, అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాగిలపడటంతో చివరివరకు ఆయన్నే కొనసాగించారు. ఏపీఎండీసీకి కొంతకాలం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ పదవిని అడ్డుపెట్టుకొని మెడికల్‌ బిల్లులు రీయింబర్స్‌ చేసుకున్నారు. ద్వివేది తల్లిదండ్రులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ చికిత్సలు చేయించారు. వాస్తవానికి ఆయన అఖిల భారత సర్వీసు అధికారి కావడంతో.. ఈ బిల్లులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. అయితే గత ఐదేళ్లలో ఏ బిల్లులూ సకాలంలో ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ద్వివేది కళ్లు ఏపీఎండీసీపై పడ్డాయి. తాను ఛైర్మన్‌గా కొనసాగుతున్నందున, తల్లిదండ్రుల వైద్యఖర్చులను రీయింబర్స్‌ చేయాలని ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనా, అప్పటి ఎండీ వెంకటరెడ్డి అడ్డుచెప్పలేదు. ద్వివేది అడిగిందే తడవుగా చెల్లించడం మొదలుపెట్టారు. రెండేళ్ల కిందట మదనపల్లెకు చెందిన షమీమ్‌ అస్లామ్‌ను ఏపీఎండీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయినా ద్వివేదికి వైద్యబిల్లుల చెల్లింపు ఆగలేదు. మొత్తం రూ.80 లక్షలు ఏపీఎండీసీ తరఫున చెల్లించారు. ఎండీయే బిల్లులు ఇవ్వాలని వెంటపడుతుంటే తాము అభ్యంతరం ఎలా చెబుతామని కొందరు అధికారులు పేర్కొన్నారు.

ఓఎస్డీకి ఏడాదిన్నరగా చెల్లింపులు 

గనులశాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ సాయి గతంలో ఏపీఎండీసీకి ఓఎస్డీగా డిప్యుటేషన్‌పై వచ్చారు. ఓ అంశంపై మంత్రి ఆగ్రహించడంతో ఆయన్ను మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు ప్రాజెక్టుకు బదిలీచేశారు. దీంతో ఏడాదిన్నరగా సెలవులోనే ఉన్నారు. ఆయనకూ ఏపీఎండీసీ నుంచి ప్రతినెలా మెడికల్‌ బిల్లులు రీయింబర్స్‌ చేశారు. ఆయన గనులశాఖ అధికారి కావడంతో, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవాలి. కానీ ఎండీ వెంకటరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేషన్‌ నుంచే ఇప్పటివరకు బిల్లులు చెల్లించారు.

రూ.9 కోట్ల కోసం మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ ప్రయత్నాలు 

ఏపీఎండీసీ 2019లో ఇసుక వ్యాపారం ఆరంభించినప్పుడు మురళీ మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ ద్వారా వందల సంఖ్యలో పొరుగుసేవల ఉద్యోగులను నియమించుకున్నారు. అప్పట్లో వీటిలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2021 మేలో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం నుంచి వైదొలిగాక వారిలో చాలామందిని తొలగించారు. అప్పటివరకు వారి జీతాలు తదితరాలన్నీ ఏజెన్సీకి చెల్లించారు. అయితే కొవిడ్‌ సమయంలో ఉద్యోగులకు మెడికల్‌ కిట్లు ఇచ్చానని, బోనస్‌లు ఇచ్చానని, వాటికి రూ.9కోట్లు ఇవ్వాలంటూ ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. గత ఎండీ వెంకటరెడ్డి రెండుదఫాలు ఆ ఫైల్‌కు క్లియరెన్స్‌ ఇచ్చారు. తర్వాత చెల్లింపులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ బిల్లుల మంజూరు కోసం ఏజెన్సీ నిర్వాహకులు లాబీయింగ్‌ మొదలుపెట్టారు.

మంత్రి ఓఎస్డీగా అనూహ్యంగా చేరి.. వెంటనే తప్పించి 

గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఎవరు నియమితులవుతారనేది ఆ శాఖలో పెద్ద చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఏపీఎండీసీలో డిప్యుటేషన్‌పై ఉండి, ఏడాదిన్నరగా సెలవులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ సాయి గతవారం మంత్రి వద్ద ఓఎస్డీగా చేరారు. ఇది తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో రెండు రోజుల్లోనే పంపేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు ముగ్గురు, నలుగురు అధికారులు లాబీయింగ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని