AP Govt: ‘ఆధార్‌’ లేకుంటే 10 రకాల పత్రాలు ఇవ్వొచ్చు.. ‘అమ్మకు వందనం’ పథకంలో వెసులుబాటు

రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Updated : 11 Jul 2024 08:38 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మకు వందనం పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. స్టూడెంట్‌ కిట్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు,   వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు. ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్‌ను కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్‌ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే    ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని