Srikakulam: అ‘ధర్మం’ బరితెగిస్తే అధికారులు అంటకాగారు!

వైకాపా పాలనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి లేఅవుట్‌కు రాజమార్గాన్ని వేసుకునేలా ప్రణాళికలు రచించారు.

Updated : 06 Jul 2024 06:41 IST

ప్రైవేటు లేఅవుట్‌కు రాజమార్గం
వంశధార కాలువపై వంతెనల నిర్మాణానికి సన్నాహాలు  
ప్రభుత్వం మారడంతో మాజీ మంత్రి వ్యూహం గుట్టురట్టు

వంశధార కుడి ప్రధాన కాలువపై లేఅవుట్‌ ఎదురుగా చేపట్టిన వంతెన నిర్మాణం  

 ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం : వైకాపా పాలనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి లేఅవుట్‌కు రాజమార్గాన్ని వేసుకునేలా ప్రణాళికలు రచించారు. వంశధార కాలువను కొల్లగొట్టి రెండు వంతెనలు, రహదారి నిర్మాణానికి రూ.కోట్లు వినియోగించారు. ఈ అక్రమ వ్యవహారానికి అధికారులు సహకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు, సిలగాంసింగివలస గ్రామాల పరిధిలో 70 ఎకరాల్లో మాజీ మంత్రి కుమారుడు లేఅవుట్‌ వేశారు. ఇది జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో వంశధార కుడి ప్రధాన కాలువను ఆనుకుని ఉంటుంది. లేఅవుట్‌ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా వంశధార కుడి ప్రధాన కాలువపై 44 కి.మీ, 48 కి.మీ. వద్ద వంతెనల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఇందుకోసం రూ.మూడు కోట్లకు పైగా మంజూరు చేయించారు. లేఅవుట్‌ నుంచి జాతీయ రహదారి వరకు వంశధార కుడి ప్రధాన కాలువపై 13 అడుగుల గట్టును రోడ్డు నిర్మాణం పేరిట సుమారు 30 అడుగులకు విస్తరించి మట్టి రహదారి సిద్ధం చేశారు. ఇందుకోసం గూడెం గ్రామం నుంచి లేఅవుట్‌ మీదుగా మునుసుబుపేట, జాతీయ రహదారి వరకు 9 కిలోమీటర్ల మేర పనులకు ఉపాధి హామీ పథకం నుంచి రూ.4.74 కోట్లు మంజూరు చేయించారు. అందులో రూ.1.32 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు వేగవంతం చేయడానికి అప్పట్లో అధికారులు మరో ఎత్తుగడ వేశారు. వంతెనల కోసం మంజూరుచేసే నిధులను కేటగిరీ ఏ (నీటి తీరువా నిధుల) కింద చూపారు. 

వంశధార కుడి ప్రధాన కాలువ గట్టుపై నిర్మించిన రహదారి 

నిబంధనలకు పాతర

కాలువపై వంతెనల నిర్మాణాలను సైతం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారు. తండెవలస వద్ద రెండు వంతెనలు ఉండగా మూడు కిలోమీటర్ల లోపే మరో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని చుట్టుపక్కల ఎవరూ నివసించడం లేదు. దగ్గరలో నివాసాలు ఉన్నాయని..వంతెనలు నిర్మించాలని మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నతాధికారులకు లేఖ రాసి జీవో జారీ చేయించారని సమాచారం. స్థానికుల అవసరాల పేరిట అధికారులు నిధులు పక్కదారి పట్టించి స్వామి భక్తి చాటుకున్నారు. లేఅవుట్‌లో కొంత వరకు ఇంజినీరింగ్‌ అధికారులకు వాటాలు ఉన్నాయని.. ఓ అధికారికి ఉచితంగా కొన్ని ప్లాట్లు రాసిచ్చినట్లు సమాచారం. దీంతో ఆఘమేఘాలపై అనుమతులు ఇవ్వడం.. టెండర్లు పిలిచి ఖరారు చేసి పనులు ప్రారంభించారని తెలిసింది. నిధులు మంజూరుకు గతంలో పని చేసిన జిల్లా అధికారి సహకరించారని సమాచారం. 

అక్రమ వ్యవహారానికి అధికారులు సహకరించడం..ప్రభుత్వ నిధులు వినియోగించడంపై సమగ్ర విచారణ చేయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వారి నిర్వాకంతో గార మండలానికి సాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఇటీవల నరసన్నపేటలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆదేశాలతో అధికారులు కాలువలో వంతెన నిర్మాణ పిల్లర్లను తొలగించి గార వరకు సాగునీరు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని