Republic Day: రాచరికానికి రాంరాం..

భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడంటే 1947 ఆగస్టు 15 - అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అది నిజమే అయినా... ఆనాటితో మనపై బ్రిటన్‌ రాజరికమేమీ తొలగిపోలేదు. ఆ తర్వాతా బ్రిటిష్‌ గొడుగుకిందే ఉన్నాం! 1950 జనవరి 26న భారత ప్రజలకు సంపూర్ణ రాజకీయ

Updated : 23 Jan 2024 15:33 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడంటే 1947 ఆగస్టు 15 - అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అది నిజమే అయినా... ఆనాటితో మనపై బ్రిటన్‌ రాజరికమేమీ తొలగిపోలేదు. ఆ తర్వాతా బ్రిటిష్‌ గొడుగుకిందే ఉన్నాం! 1950 జనవరి 26న భారత ప్రజలకు సంపూర్ణ రాజకీయ స్వాతంత్య్రం లభించింది. బ్రిటిష్‌ రాచరికపు సంకెళ్లను తెంచుకొని భారతావని ప్రజాతంత్రంగా ఉదయించింది.

1947 ఆగస్టు 15న మనకు బ్రిటన్‌ పార్లమెంటు స్వాతంత్య్రం ప్రకటించినా... అది సంపూర్ణ స్వాతంత్య్రమేమీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచీ మన జాతీయోద్యమకారులు కోరిన స్వయంప్రతిపత్తిని ఇచ్చారు. బ్రిటన్‌ రాజు కిందే భారత్‌ కొనసాగింది. ఆయన ప్రతినిధిగా గవర్నర్‌ జనరల్‌ను  నియమించారు. కావాలనుకుంటే (ప్రస్తుతం కెనడా, ఆస్ట్రేలియాలున్నట్లు) రాచరికం కింద కొనసాగొచ్చు... లేదంటే రాచరికం నుంచి వైదొలగి రిపబ్లిక్‌గా ప్రకటించుకునే అవకాశం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి మనకు రాజ్యాంగం లేదు. 1935లో ఆంగ్లేయులు అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారమే పాలన కొనసాగింది.

రెండు నెలలు ఆగిన రాజ్యాంగం...

స్వాతంత్య్రం వచ్చినా... బ్రిటిష్‌ వాసనలు కొనసాగుతున్న వేళ రాజ్యాంగ రచన కీలకంగా మారింది. 1946 డిసెంబరు 9న తొలిసారి సమావేశమైన రాజ్యాంగ సభ చకచకా తన పని మొదలెట్టింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యుల బృందానికి అంబేడ్కర్‌ ఛైర్మన్‌గా బెనెగళ్‌ నర్సింగ్‌ రావు (బి.ఎన్‌.రావు) సలహాదారుగా రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఐసీఎస్‌ అధికారిగా పనిచేసిన బి.ఎన్‌.రావు... రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించారు. దానిపై నిశితంగా, క్షుణ్ణంగా చర్చించాక అనేక సవరణలతో ఆమోదించారు. సామాన్యులు సైతం కమిటీ చర్చలు విని సూచనలివ్వడానికి అవకాశం కల్పించడం విశేషం. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించినా దాన్ని రెండునెలల పాటు అమలులోకి తేకుండా ఆపారు. 1930లో లాహోర్‌ సదస్సులో సంపూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్‌ నినదించింది. జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఆ ముహూర్తాన్ని గౌరవిస్తూ కొత్త రాజ్యాంగాన్ని 1950 జవవరి 26న ఆవిష్కరించారు.

మనం తీసుకున్న స్వాతంత్య్రం

ఒక రకంగా చూస్తే... 1947 ఆగస్టు 15 బ్రిటిష్‌వారిచ్చిన స్వాతంత్య్ర దినోత్సవం. అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ఆగస్టు 15నే స్వాతంత్య్రం ప్రకటించటానికి కారణముంది. రెండో ప్రపంచ యుద్ధంలో తన సారథ్యంలోని బ్రిటిష్‌ సేనకు జపాన్‌ లొంగిపోయిన రోజు ఈ ఆగస్టు 15. అందుకే ఈ రోజంటే మౌంట్‌బాటన్‌కు ఎంతో ఇష్టం. అందుకే భారత స్వాతంత్య్రానికి కూడా ఆగస్టు 15ను లార్డ్‌ మౌంట్‌బాటన్‌ మంచి రోజుగా భావించాడు. ఆగస్టు 14 అర్ధరాత్రి 11.57 నిమిషాలకు పాకిస్థాన్‌ను, ఆగస్టు 15 అర్ధరాత్రి 12.02 నిమిషాలకు భారత్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించారు. అలా తమ వలస పాలన విజయానికి గుర్తుగా ఆంగ్లేయులు ముహూర్తం పెట్టి అప్పగించిన రోజు పంద్రాగస్టు. భారతావని దాదాపు 20 ఏళ్ల ముందే ముహూర్తం పెట్టుకొని... రాచరికం నుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని తీసుకున్న రోజు 1950 జనవరి 26!


రాజ్యాంగంలో... సీతారాములు, అక్బర్‌, టిప్పు, బోస్‌

* రాజ్యాంగ నిర్మాణానికి రెండేళ్ల 11 నెలల 18 రోజులు పట్టింది.

* భారత రాజ్యాంగ అసలు ప్రతిని టైప్‌ చేయలేదు... ప్రింట్‌ చేయలేదు. చేతి రాతతో హిందీ, ఆంగ్లంలో రాశారు.

* అందమైన అక్షరాలు రాయటంలో (క్యాలిగ్రఫీలో) దిట్టగా పేరొందిన ప్రేమ్‌ బెహారి నారాయణ్‌తో దీన్ని రాయించారు.

* ఠాగూర్‌ శాంతినికేతన్‌కు చెందిన నందలాల్‌ బోస్‌; ఆయన శిష్యుడు రామ్‌మనోహర్‌ సిన్హాలు... సనాతన భారతీయ ప్రతీకలతో పాటు... జాతీయోద్యమంలోని నేతలు... ఘట్టాల దాకా వివిధ అంశాలను ప్రతి పేజీలో అద్భుతంగా చిత్రించారు.

* వేదాలు... రామాయణ ఘట్టాలు... మొహంజోదారో, బుద్ధుడు, మహావీరుడు, గుప్తులపాలనలోని స్వర్ణయుగాలతో మొదలెట్టి... మధ్యయుగంనాటి... మహాబలిపురంలోని నటరాజ శిల్పం; మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌, మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ; మైసూర్‌ మహారాజు టిప్పుసుల్తాన్‌, వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ దండి యాత్ర, త్రివర్ణపతాకానికి సుభాష్‌చంద్రబోస్‌ సెల్యూట్‌ చేస్తున్న బొమ్మలను గీశారు.

* రాజ్యాంగం అమల్లోకి రాగానే రాజ్యాంగ సభ సహజంగానే రద్దయి... తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. సభ ఛైర్మన్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ తొలి రాష్ట్రపతి అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు