Rushikonda: జగన్‌ మాయామహల్‌.. అన్నీ విదేశీ వస్తువులే

ఊరూరా ప్యాలెస్‌లతో ఊరేగిన జగన్‌ రుషికొండ మీద తన కోసమే అన్నట్లు మరో ప్యాలెస్‌ను నిర్మించుకోగా అందుకు చేసిన ఖర్చు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే.

Updated : 19 Jun 2024 06:46 IST

మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలన్నీ దిగుమతి చేసినవే
ఐదు దేశాల గ్రానైట్, మార్బుల్స్‌ వినియోగం
వందల సంఖ్యలో విద్యుత్తు దీపాలు.. ఒక్కో దీపం ఖరీదు రూ.60 వేలు

ఈనాడు, విశాఖపట్నం: ఊరూరా ప్యాలెస్‌లతో ఊరేగిన జగన్‌ రుషికొండ మీద తన కోసమే అన్నట్లు మరో ప్యాలెస్‌ను నిర్మించుకోగా అందుకు చేసిన ఖర్చు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. కొండను తవ్వి భవనాలను నిర్మించడం ఒకెత్తయితే.. వాటిల్లోని ఇంటీరియర్, ఫర్నీచర్‌ వస్తువుల విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పడుకునే మంచం, ముఖం చూసుకునే అద్దం మొదలుకొని స్నానాల తొట్టె, మరుగుదొడ్డిలోని కమోడ్లు, కిటికీలకు ఉపయోగించే కర్టెన్ల వరకు అన్నీ విదేశాల నుంచి తెప్పించినవే. చివరకు మరుగుదొడ్లలో వినియోగించిన వాల్‌షీట్లు విదేశాలవే. ఇలా అడుగడుగునా రాజసం ఉట్టిపడేలా అత్యంత స్టైలిష్‌గా నిర్మించుకున్నారు. వైకాపాను ప్రజలు ఇంటికి పంపడంతో రుషికొండ రహస్యం బట్టబయలైంది. వాటి లెక్క ప్రస్తుతం గమనిస్తూ ఐశ్వర్యవంతులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రజాధనంతో ఇంత జల్సానా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

జగన్‌ పడక గదికే రూ.కోట్లు ఖర్చు

రుషికొండ మీద నిర్మించిన భవనాల్లో సీఎం కుటుంబ అవసరాలకు విజయనగర బ్లాక్‌ పేరుతో మూడు భవనాలు నిర్మించారు. ఈ మూడింటినీ ఒక దానికిమించి ఒకటి తలదన్నేలా కట్టారు. సీఎం నివాసంలోని పడక గదికి చేసిన ఖర్చు చూస్తే అవాక్కవ్వాల్సిందే. లేత బంగారువర్ణంతో ఆ గది మెరిసేలా షాండ్లియర్లను అమర్చారు. ఆ గదిలోని ఫ్లోర్‌ కోసం యూరప్‌ నుంచి ప్రత్యేకంగా గ్రానైట్‌ను తెప్పించారు. దాని మీద ప్రత్యేక డిజైన్‌ మార్బుల్‌తో చెక్కించారు. అందులో వినియోగించిన మంచం, పరుపు, కుర్చీలు, బల్లలు విదేశాలనుంచి తెచ్చారు. ఇదే గదిలో బయోమెట్రిక్‌తో పనిచేసే వార్డ్‌రోబ్స్‌ను ఏర్పాటుచేశారు. అందులో విలాసవంతమైన స్పా, మరుగుదొడ్లు ఉన్నాయి. ఇక్కడున్న మరుగుదొడ్డిలోని కమోడ్‌ జపాన్‌కు చెందింది. ఇలాంటివి అత్యంత సంపన్నులు మాత్రమే కొంటారు. ఒక్కదాని విలువే రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా.

ఐదు దేశాల నుంచి గ్రానైట్‌ 

రుషికొండ మీద భవనాలకు వినియోగించిన గ్రానైట్, మార్బుల్‌ను ఐదు దేశాల నుంచి దిగుమతి చేశారు. వియత్నాం, స్పెయిన్, ఇటలీ, నార్వే, బ్రెజిల్‌కు చెందిన మెటీరియల్‌ వాడారు. వీటిని తీసుకురావడం ఒకెత్తయితే అత్యద్భుతంగా నగిషీలు అద్దడం మరో సృజన. పడక గదులు, సమావేశ మందిరాలను విభిన్న ఆకృతులతో ధగధగా మెరిసేలా రూపొందించారు. గోడలపై పాలరాయి తాపడాలతో విభిన్న ఆకృతులు వచ్చేలా పనులు చేయించారు. 


ఉద్యానవనం

నివాస భవనాల బయట విదేశాలనుంచి తీసుకొచ్చిన వేల మొక్కలతో గార్డెనింగ్‌ చేశారు. ఇందులో అందమైన విద్యుత్తు అలంకరణలున్నాయి. దీనికే రూ.20 కోట్లు ఖర్చు చేశారు. 


షాండ్లియర్లు

గదుల్లో విద్యుత్తు అందాల కోసం వినియోగించిన వీటి ధర ఒక్కొక్కటి రూ.రెండున్నర లక్షలు. ఇలాంటివి వంద వరకు ఏర్పాటు చేశారు. ఇవన్నీ విదేశాలనుంచి తెప్పించినవే.


బాత్‌ టబ్‌

జపాన్‌ నుంచి దీన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. విలువ రూ.6 లక్షలు.  


దీపాలు

ఇంటి బయట గోడల చుట్టూ అలంకరణ కోసం వినియోగించిన విద్యుత్తు దీపాలను దిల్లీ నుంచి తెప్పించారు. ఒక్కో బల్బు ధర రూ.60 వేలు. అలాంటివి వంద వరకు ఉన్నాయి. ఇవి కాకుండా సుందరీకరణ, అలంకరణ దీపాలతోపాటు ఇంటి లోపల కలిపి సుమారు 4 వేల దీపాలను వినియోగించినట్లు సమాచారం. 

  • ఫ్యాన్లు: సీఎం నివసించే భవనాల్లో విసనకర్ర, ఫ్లవర్‌ ఆకృతుల్లో ఉండే రెండు రకాల మోడళ్లను వినియోగించగా ఒక్కొక్కదాని ధర రూ.లక్షన్నర. ఇలాంటివి పదుల సంఖ్యలో విదేశాల నుంచి తెచ్చారు.
  • కమోడ్లు: సీఎం గదిలో కాకుండా మిగిలిన భవనాల్లో అమర్చిన ఒక్కో కమోడ్‌ ధర రూ.88 వేలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని