Andhra News: అప్పుడు అవినాష్‌రెడ్డి సిఫార్సుతో పోస్టింగ్‌లు.. ఇప్పుడు వెనక్కి పోతామంటూ వేడుకోలు

ఆలయాలకు ఈఓలుగా దేవాదాయశాఖ అధికారులే ఉండాలి. రెవెన్యూశాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డిప్యుటేషన్‌పై దేవాదాయశాఖలో ఈఓలుగా పనిచేసేందుకు వీలుంది.

Published : 24 Jun 2024 09:10 IST

ఈనాడు, అమరావతి: ఆలయాలకు ఈఓలుగా దేవాదాయశాఖ అధికారులే ఉండాలి. రెవెన్యూశాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డిప్యుటేషన్‌పై దేవాదాయశాఖలో ఈఓలుగా పనిచేసేందుకు వీలుంది. కానీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సిఫార్సుతో.. వయోజన విద్య, పంచాయతీరాజ్‌శాఖలకు చెందిన ఇద్దరు అధికారులు దేవాదాయశాఖకు వచ్చి.. రెండు కీలక ఆలయాలకు ఈఓలుగా పెత్తనం చేస్తున్నారు. మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో రెండేళ్లు పదవీకాలాన్నీ పొడిగించేలా చూసుకున్నారు. తీరా కూటమి ప్రభుత్వం రావడంతో.. ఇప్పుడు మాతృశాఖలకు వెళ్లిపోతామంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వయోజన విద్య విభాగంలో ఉపసంచాలకుల కేడర్‌లో ఉన్న కె.చంద్రశేఖర్‌రెడ్డి దేవాదాయశాఖకు వచ్చి, ఉపకమిషనర్‌ కేడర్‌ కలిగిన మహానంది ఆలయ ఈఓగా పనిచేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల ఎంపీడీవో కార్యాలయంలో ఏఓగా ఉన్న ఎ.ముకుందరెడ్డి కూడా ఇలాగే వచ్చి అదే నియోజకవర్గంలో ప్రఖ్యాతిగాంచిన గండి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వీరిద్దరినీ 2022లో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సిఫార్సుతో.. నిబంధనలు పట్టించుకోకుండా దేవాదాయశాఖ అధికారులు డిప్యుటేషన్‌పై తీసుకున్నారు.

మరో రెండేళ్లు కొనసాగుతామని..: తొలుత ఏడాది పాటు 2023 వరకు కొనసాగారు. మళ్లీ మరో ఏడాది డిప్యుటేషన్‌ కొనసాగించేందుకు గతేడాది ఫిబ్రవరిలో వీరి దస్త్రాన్ని అప్పటి దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.కె.సింఘాల్‌కు పంపగా, ఆయన దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వీరిని ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తూ వెనక్కి పంపారు. తర్వాత వారానికే సింఘాల్‌.. గవర్నర్‌కి ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లిపోయారు. దీంతో కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌కు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా కొద్దిరోజులు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఆయన ఇద్దరు ఈఓల దస్త్రాన్ని బయటకు తీసి డిప్యుటేషన్‌ పొడిగిస్తూ ఆదేశాలిచ్చేశారు. తర్వాత మరో రెండేళ్లు ఈ పోస్టుల్లో కొనసాగుతామంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ ఇద్దరూ మళ్లీ అర్జీ పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, పూర్వపు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ద్వారా ఒత్తిళ్లు చేయించారు. దీంతో ఈ మేరకు దస్త్రాన్ని దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వళవన్‌కు పంపగా, దీనికి ఆయన ఆమోదం తెలిపి, 2026 ఫిబ్రవరి వరకు డిప్యుటేషన్‌పై కొనసాగేలా ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు నెలల కిందటే డిప్యుటేషన్‌ ఆదేశాలు తెప్పించుకున్న ఆ ఇద్దరు ఈఓలు.. ఇప్పుడు తమ మాతృశాఖలకు వెళ్లిపోతామంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఎందుకు అడుగుతున్నారనేది దేవాదాయశాఖలో చర్చనీయాంశంగా మారింది. వీరిలో గండి ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ముకుందరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన వచ్చాక అన్నప్రసాదం నాసిరకంగా ఉందని, టెండర్లలో చేతివాటం చూపిస్తున్నారని, ఈయన హయాంలో రూ.20 కోట్ల సీజీఎఫ్‌ నిధులతో చేపడుతున్న పనులు సరిగా లేవనే విమర్శలు ఉన్నాయి. ఈయన భార్య గతంలో పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని