Irrigation Projects: తక్కువ వ్యయం.. త్వరిత ప్రయోజనం

ఐదేళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం.

Updated : 22 Jun 2024 10:21 IST

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం
సత్వరం పూర్తయి.. త్వరితగతిన ఉపయోగపడే ప్రాజెక్టులు 31
వాటికే తొలి ప్రాధాన్యమివ్వాలి
మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.04 లక్షల కోట్లు అవసరం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా తవ్వుతున్న సొరంగం

ఈనాడు, అమరావతి: ఐదేళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలాకాలం పడుతుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ భారం.. అధిక ప్రయోజనం వ్యూహమే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 59 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2.33 లక్షల కోట్లు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులపై రూ.1.29 లక్షల కోట్లు వెచ్చించినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆ లెక్కన వీటి నిర్మాణం పూర్తి చేయాలంటే ఇంకా రూ.1.04 లక్షల కోట్లు కావాలి. మొత్తం 59 ప్రాజెక్టుల్లో 31 ప్రాజెక్టులను ప్రాధాన్యంగా గుర్తించి చాలినన్ని నిధులు కేటాయిస్తే త్వరితగతిన ప్రయోజనాలు అందుతాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

జగన్‌ హయాం.. జలయజ్ఞం వైఫల్యం

జగన్‌ సర్కార్‌లో సాగునీటి ప్రాజెక్టులపై తక్కువ వ్యయం చేసినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 7 శాతం ఖర్చు చేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ రంగానికి కేవలం 3 శాతమే వెచ్చించారు. దాన్ని 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలో 9 శాతానికి పెంచారు. జలయజ్ఞంపై ఎన్నో హామీలు గుప్పించిన జగన్‌ ప్రభుత్వం దాన్ని మళ్లీ 4 శాతానికి తగ్గించేసింది. కీలక రంగాలపై వెచ్చించే నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితేనే అంచనా వ్యయాలు భారీగా పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతాం. జగన్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని అంతకు ముందు ప్రభుత్వం కంటే సగానికి పైగా తగ్గించేయడంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది.

నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు మట్టి కట్ట పనులు

ఎలా ముందుకెళ్లాలి? 

  • మొత్తం 59 ప్రాజెక్టుల్లో 31 ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయొచ్చు. తద్వారా రాష్ట్రాన్ని కరవుకోరల్లోంచి బయటకు తీసుకురావచ్చని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి, వాటిని పూర్తి చేస్తే సత్వర ఫలితాలు అందుతాయి.
  • గుత్తేదారులకు రూ.వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. చాలామంది గుత్తేదార్లు పనులు వదిలేసి వెళ్లిపోయారు. సాగునీటి రంగంలో మొత్తం పెండింగు బిల్లులు ఎంత ఉన్నాయో తేల్చాలి. ఫిఫో (మొదట వచ్చిన బిల్లు మొదటే చెల్లించే క్రమం) పద్ధతిలో బిల్లుల చెల్లింపులకు హామీ ఇవ్వాలి. గుత్తేదారులకు భరోసా కల్పించాలి. వారు  మళ్లీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు పోటీపడే వాతావరణం సృష్టించాలి.
  • భూసేకరణ, అటవీ అనుమతులు రాకపోవడంతో చాలా ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. దీంతో అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి. తొలుత భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో, అటవీభూమికి సంబంధించి కేంద్ర వద్ద పరిష్కారం కావాల్సిన అంశాలపై దృష్టి సారించాలి.
  • డిజైన్ల ఆమోదమూ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర ఆకృతుల సంస్థకు అవసరమైన నాణ్యమైన ఇంజినీరింగ్‌ సిబ్బందిని నియమించాలి. అక్కడ సమస్యలు పరిష్కరించాలి. కొన్నిచోట్ల ఎన్నాళ్ల నుంచో పని లేకుండా ఉండిపోయిన ఇంజినీరింగ్‌ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేసి, అవసరం ఉన్న చోట నియమించాలి. చేయడానికి పనిలేని అలాంటి యూనిట్లను గుర్తించి, వాటిని సంస్కరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని