Andhra News: విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!

దేశ తూర్పు తీరాన పోర్ట్‌ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది.

Updated : 07 Jul 2024 08:27 IST

ఏఐ, ఏవియేషన్‌ రంగాలకూ అనుకూలతలు
ఎన్డీయే ప్రభుత్వంపై యువతలో భారీ ఆశలు
మంత్రి లోకేశ్‌కు ఐటీ సంస్థల ప్రతిపాదనలు
వైకాపా పాలనలో వెనక్కిపోయిన పరిశ్రమలు

విశాఖపట్నం ఐటీ హిల్స్‌లో 3.5 లక్షల చదరపు అడుగుల ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న మిలీనియం టవర్‌ 

ఈనాడు, విశాఖపట్నం: దేశ తూర్పు తీరాన పోర్ట్‌ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే కొలువుదీరడం, ఐటీ, పరిశ్రమలను ప్రోత్సహించే ప్రకటనలు చేస్తుండటం వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. వైకాపా ఐదేళ్ల పాలనలో విశాఖ సాగరతీరంలో ఐటీ వెలుగులు ఆరిపోయాయి. జగన్‌ సర్కారు వేధింపులు తట్టుకోలేక పలు పెద్ద కంపెనీలు నగరాన్ని వదిలి వెళ్లిపోయాయి. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున గతంలో ప్రతిపాదించిన, ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలను గ్రౌండింగ్‌ చేయించడంపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా విశాఖ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి పరిశ్రమ  ఉన్నతికి గల అవకాశాలు, ప్రభుత్వం సమకూర్చాల్సిన రాయితీలపై వినతిపత్రాలు అందించారు. 

 అపారమైన అవకాశాలు 

  • రుషికొండ ప్రాంతంలోని ఐటీ హిల్‌ నంబరు-3లో ఐబీఎంకు ఎదురుగా ఉన్న 23 ఎకరాల్లో పీపీపీ విధానంలో కొత్త ఐటీ పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ జీవీఎంసీ అనుమతులతో పాటు జీరో కాస్ట్‌ ఎంట్రీతో రిజిస్ట్రేషన్‌ లేకుండా భూబదలాయింపు చేయాలని, వీఎల్‌టీ ఛార్జీలపై మినహాయింపు ఇవ్వాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి.
  • కొత్త మిలీనియం టవర్‌లోని భవనాల్లో 3.5 లక్షల చదరపు అడుగుల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. ఒక్కో కంపెనీకి 25 వేల చ.అడుగుల స్థలం కేటాయించి, వెయ్యి మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించేలా చూడొచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీలకు మూడేళ్లపాటు ఉచితంగా స్థలాన్ని కేటాయించవచ్చు. 
  • హిల్‌-2, 3లలో ఖాళీగా ఉన్న 10 లక్షల చ.అడుగుల స్థలాన్ని కొత్త కంపెనీలకు కేటాయించాలని, 50% అద్దె రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నారు. 

అదానీ డేటా సెంటర్‌ పూర్తి చేస్తేనే..

విశాఖలో 2019 ఫిబ్రవరి 15న అప్పటి తెదేపా ప్రభుత్వం అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసింది. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 20 ఏళ్లలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ఈ కేంద్రం లక్ష్యం. తర్వాత కొద్ది రోజులకే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని సమీక్షించింది. అదానీ సంస్థ పెట్టుబడుల ప్రతిపాదనను రూ.14,643 కోట్లకు పరిమితం చేసి, 2020 నవంబరులో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు హిల్‌-4లోని వైజాగ్‌ టెక్‌ పార్కులో 130 ఎకరాలు కేటాయించారు. తర్వాత అదానీ సంస్థ మరోసారి పెట్టుబడులను రూ.7,210 కోట్లకు తగ్గించి, ప్రత్యక్షంగా 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. తగ్గించిన పెట్టుబడులకు అనుగుణంగా కేటాయించిన భూమిని 60.29 ఎకరాలకు కుదించారు. వంద మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏడేళ్లలో పూర్తి చేయనున్నట్లు అప్పట్లో పేర్కొన్నా, ప్రస్తుతం అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఎన్డీయే ప్రభుత్వం దీనిపై సమీక్షించి అదానీ కేంద్రం నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సి ఉంది.


బహుముఖాభివృద్ధికి ఇవిగో బాటలు

ఇటీవల మంత్రి లోకేశ్‌ను కలిసిన ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పలు విజ్ఞప్తులు అందించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు సమకూరిస్తే, విశాఖ కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని, ఇది ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.

  • ఐటీ కంపెనీలకు గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలు, ప్రోత్సాహకాలను చెల్లించాలి.
  • ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కొత్త విధానాలతో పాటు రాయితీలు ప్రకటించాలి.
  • కేంద్ర ప్రభుత్వ సాయంతో నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, యానిమేషన్‌/ గేమింగ్‌/ వీఎఫ్‌ఎక్స్, విదేశీ భాషా ప్రయోగశాలలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దాలి.
  • భోగాపురం విమానాశ్రయం, శ్రీకాకుళం జిల్లాలోని కొత్త పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయాలి. భోగాపురంలో సివిల్, డిఫెన్స్‌   ఎయిర్‌ క్రాఫ్ట్‌ రెండింటికీ సంబంధించి పౌర విమానయాన విశ్వవిద్యాలయం, విమానాల నిర్వహణ, మరమ్మతుల (ఎం.ఆర్‌) విభాగాన్ని నెలకొల్పాలి.
  • ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరాలి. ఇంటర్నెట్‌ ఖర్చులను తగ్గించడానికి విశాఖలో ఇంటర్నెట్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఐఎక్స్‌ఐ) నెలకొల్పాలి.
  • రుషికొండ, భోగాపురంలో ప్రతిపాదిత రెండు ఐటీ కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణాలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని