Jogi Ramesh: అగ్రిగోల్డ్‌ భూముల్లో ‘జోగి’ భోగం

వైకాపా ప్రభుత్వంలోని పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి చీకటి రాజ్యంలో అన్నీ పగటి దోపిడీలే! మంత్రి పదవి వెలగబెట్టిన జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి.. తన కొడుకు, బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు.

Published : 19 Jun 2024 06:07 IST

అంబాపురంలో మాజీ మంత్రి పగటి దోపిడీ
సర్వే నంబరు మార్చి భూ కబ్జా.. విక్రయం
నిస్సిగ్గుగా సహకరించిన రెవెన్యూ అధికారులు

విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కబ్జా చేసిన స్థలం.. చుట్టూ ప్రహరీ నిర్మాణం

ఈనాడు - అమరావతి: వైకాపా ప్రభుత్వంలోని పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి చీకటి రాజ్యంలో అన్నీ పగటి దోపిడీలే! మంత్రి పదవి వెలగబెట్టిన జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి.. తన కొడుకు, బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు. వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. జోగి రమేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కిపెట్టారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీ సర్వేనంబరు 87లో అవ్వా వెంకట శేషునారాయణరావు, వారి బంధువులకు భూములు ఉన్నాయి. వీరు అగ్రిగోల్డ్‌ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్‌ కేసులో ప్రభుత్వం రీసర్వే నంబరు 87లో 2,293.05 గజాల స్థలాన్ని జప్తు చేసింది. వాటిపై వైకాపా నాయకుల కన్ను పడింది. పక్కా ప్రణాళిక వేశారు. అంబాపురంలోనే రీసర్వే నంబరు 88లో పోలవరపు మురళీమోహన్‌ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ 1,074 గజాలు, ఆయన బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు 1,086 గజాలు కొని 2022లో రిజిస్టర్‌ చేయించారు. ఆ దస్తావేజుల్లో సర్వే నంబరు 88 అని స్పష్టంగా ఉంది. తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నంబరు 87కు బదులు 88 అని తప్పుగా నమోదైందంటూ దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్‌ మంత్రిగా ఉండటంతో ఏమాత్రం విచారణ లేకుండా అధికారులు సర్వే నంబరు మార్చేశారు. వాస్తవానికి అగ్రిగోల్డ్‌ కేసులో జప్తు చేసిన భూములు ఉన్న రీసర్వేనంబరు 87ను నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని రిజిస్టర్‌ చేసేందుకు అవకాశం లేదు. కానీ అవేవీ పట్టించుకోకుండా సవరణ దస్తావేజులు జారీ అయ్యాయి. వెంటనే జోగి మనుషులు అగ్రిగోల్డ్‌ భూముల స్వాధీనానికి వెళ్లారు. వాస్తవ యజమాని అభ్యంతరం పెట్టడంతో తహసీల్దారు ద్వారా ఆర్‌సీ నంబరు ఎఫ్‌ఎల్‌ 24284/2023, ఎఫ్‌ఎల్‌ 24248/2023 తేదీ 1.3.2023 కింద భూమి స్వాధీన ఉత్తర్వులు పొందారు. ఈ లేఖలతో అగ్రిగోల్డ్‌ భూమిని స్వాధీనం చేసుకున్న జోగి తనయుడు జోగి రాజీవ్‌ ప్రహరీ కట్టేశారు. 

వెంటనే అమ్మకం: దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే 2023 మే నెలలో వైకాపా కార్పొరేటర్‌ పడిగపాటి చైతన్యరెడ్డి బంధువులకు అమ్మేశారు. వాస్తవ యజమానులు దానిపై 2024 జనవరిలో విజయవాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సబ్‌ ఇన్‌స్పెక్టరు గ్రామీణ తహసీల్దారుకు లేఖ రాశారు. దీనిపై నాటి తహసీల్దారు జాహ్నవి 2024 మార్చి 30న తన నివేదికను పోస్టులో పోలీసులకు పంపారు. కానీ ఇప్పటి వరకు ఆ నివేదికను పోలీసులు కనీసం చూడలేదు. జోగి రమేష్‌ ఒత్తిడితోనే ఈ భూముల కబ్జా వెలుగులోకి రానీయకుండా అధికారులు తొక్కి పెట్టారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని