LG Chem company: అదనంగా రూ.120 కోట్ల సాయం

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులు, ప్రభావిత గ్రామాలకు అదనంగా రూ.120 కోట్లు సాయం చేసేందుకు దాని మాతృ సంస్థ ఎల్జీ కెమ్‌ ముందుకొచ్చింది.

Published : 11 Jul 2024 04:59 IST

ఎల్జీ పాలిమర్స్‌ బాధితులు, ప్రభావిత గ్రామాల కోసం
వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం, ఆసుపత్రుల్లో చికిత్సలు
సీఎం చంద్రబాబు వద్ద ఎల్జీ కెమ్‌ ప్రతినిధుల ప్రతిపాదన 

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులు, ప్రభావిత గ్రామాలకు అదనంగా రూ.120 కోట్లు సాయం చేసేందుకు దాని మాతృ సంస్థ ఎల్జీ కెమ్‌ ముందుకొచ్చింది. బాధితులకు నిరంతరం వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయటంతో పాటు, 15 రకాల ఆరోగ్య సమస్యలకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తామని ప్రతిపాదించింది. ఎల్జీ పాలిమర్స్‌ ప్లాంటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 5 వేల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే మార్గాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చించింది. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్‌ సంస్థ ఉపాధ్యక్షుడు షిన్‌ హక్‌ చోల్, సీఎఫ్‌వో చ డొంగ్‌ సియోక్, పెట్రో కెమికల్స్‌ బిజినెస్‌ డివిజన్‌ చీఫ్‌ నో కుక్‌ లే.. తదితరులు మంగళవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించినట్లు దక్షిణ కొరియాకు చెందిన ‘ది కొరియా ఎకనమిక్‌ డైలీ’ పత్రిక కథనం ప్రచురించింది. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. వాటిలో వచ్చే తీర్పు కోసం వేచి చూడకుండా ముందస్తుగానే అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ఎల్జీ కెమ్‌ ప్రతిపాదించినట్లు ఆ పత్రిక తెలిపింది. 

శ్రీ సిటీకి తరలింపు.. కొత్తగా పెట్టుబడులు

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ ప్లాంట్‌ను శ్రీ సిటీకి తరలించి, అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టి మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ ప్లాస్టిక్స్‌ కాంపౌండ్‌(ఏబీఎస్‌) తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. ఏడాదికి 50 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని ప్లాంటును సురక్షిత, పర్యావరణ హిత వ్యాపార నిర్వహణ కోసం వినియోగిస్తామని ప్రతిపాదించారు. విశాఖపట్నం ప్లాంటులో గతంలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రీ సిటీలో పనిచేయటానికి ఆసక్తి చూపిస్తే వారికి అవకాశం కల్పిస్తామని, అదనంగా వచ్చే ఉద్యోగాల్లోనూ విశాఖపట్నం ప్రాంతం వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 

అదనపు సాయం కోసం ప్రతిపాదనలు

విశాఖపట్నం శివారు ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి 2020 మే 7 తెల్లవారుజామున గ్యాస్‌ లీకేజీ కాగా.. ఆ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మందికి పైగా బాధితులు అనారోగ్యాల బారిన పడ్డారు. ఇప్పటికీ వారికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఘటన జరిగాక మృతుల కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి చొప్పున ప్రభుత్వం చెల్లించింది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ కూడా విశాఖపట్నం కలెక్టర్‌ వద్ద పరిహారం కోసం కొంత మొత్తం డిపాజిట్‌ చేసింది. వాటితో ప్రమేయం లేకుండా మళ్లీ అదనంగా సాయం అందించేందుకు ఆ సంస్థ సీఎం చంద్రబాబు వద్ద తాజాగా ప్రతిపాదనలు పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని