AP news: ఐదేళ్ల అగచాట్లకు చెల్లు

సీఎం ఇంటి పక్క నివాసమంటే గర్వపడాలి. కానీ మాకు రోజూ వేధింపులే! సీఎం భద్రత కోసమే అయితే.. ఆయన వచ్చీవెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆపేయొచ్చు.

Updated : 18 Jun 2024 11:33 IST

ఇంతకాలమూ అటు చూడనీయలేదు.. నడవనీయలేదు
సొంతింటికి వెళ్లాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది
దానికీ గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి
తాడేపల్లిలో జగన్‌ నివాసం చెంత ఆంక్షల ఎత్తివేతపై స్థానికుల సంబరం
ఈనాడు-అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే

జగన్‌ క్యాంపు కార్యాలయం ముందు అత్యాధునిక ఆటోమేటిక్‌ గేట్లు తెరుచుకోవడంతో రేవేంద్రపాడు- తాడేపల్లి మధ్య రాకపోకలు సాగిస్తున్న సామాన్యులు

సీఎం ఇంటి పక్క నివాసమంటే గర్వపడాలి. కానీ మాకు రోజూ వేధింపులే! సీఎం భద్రత కోసమే అయితే.. ఆయన వచ్చీవెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆపేయొచ్చు. కానీ, ఐదేళ్లూ అన్ని రోడ్లు మూసేయాలా? ఆయన ఇంటికి అంతెత్తున ఇనుప కంచెలా? జగన్‌కు అంత పిరికితనం ఎందుకు? ఆ భవంతి చుట్టూ కంచె చూస్తుంటే.. జైళ్లు గుర్తొస్తున్నాయి. ఆయన ఆ ఆలోచనలోనే జీవిస్తున్నారా? మేం పుట్టి పెరిగిన ఊరిలో బయటకు వెళ్లాలన్నా, సొంతింటికి రావాలన్నా గుర్తింపు కార్డులు చూపించాలా? ఏడాదిన్నర కిందట ఫ్లాట్‌ కొన్నాం. పక్కనే విశాలమైన రోడ్డున్నా ఏ రోజూ ఆ దారిలో వెళ్లలేకపోయాం. పేదలు అర గజం ఆక్రమించి కట్టుకున్నా కూల్చేస్తారే, మరి రోడ్డుపైనే గదులు కట్టుకొని, కంచె నిర్మించిన జగన్‌మోహన్‌రెడ్డిని ఏం చేయరా? తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి పక్కన పడేస్తారా? ఆయనేం నాయకుడండీ? విజయవాడ, గుంటూరు నగరాల మధ్యనున్న తాడేపల్లి, దాని చుట్టుపక్కల గ్రామల ప్రజల ఆగ్రహమిది.

మాజీ సీఎం జగన్‌ ఇంటి పక్కనే నిర్మించిన నాలుగు వరసల రోడ్డుతో పాటు దాని పక్కనే ఉన్న కాలువ కట్ట రహదారిపై ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంక్షలు తొలగించడంతో స్వేచ్ఛ లభించిందనే సంతోషం స్థానికుల్లో వెల్లివిరిసింది. ఇటీవలి వరకు తాడేపల్లి, సమీప గ్రామాల వారు తమ సొంతిళ్లకు కూడా స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితి. అడుగడుగునా పోలీసులు తనిఖీ చేసేవారు. మీరెవరు, ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించేవారు. ఇన్నాళ్ల ఆంక్షలు తొలగి రాకపోకలకు మార్గం సుగమం కావడంతో సమీప అపార్ట్‌మెంట్ల వాసులు మొదలు రైతులు, వ్యాపారులు కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చిన రోడ్డుపై వెళ్తూ వీడియోలు తీసుకుంటూ, సంబర పడిపోతున్నారు. దీనిపై యూట్యూబ్‌లో పెడుతున్న వీడియోలను లక్షల మంది వీక్షిస్తున్నారు. అయితే, ఇప్పటికీ జగన్‌ ఇంటి ముందు మాత్రం ఆంక్షలు, పరదాలు, చుట్టూ ఎత్తైన కంచె తొలగించకపోవడం చూస్తుంటే, ఆయనెంతటి అభద్రతాభావంలో బతుకుతున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


జగన్‌ నివాసం వెనుక తెరుచుకున్న మార్గంలో వెళ్తున్న ద్విచక్ర వాహనాలు

పేదల్ని తరిమేసి, రోడ్డు మూసేసి

2019లో జగన్‌ ముఖ్యమంత్రి కాగానే తన ఇంటి వెనుక ఉన్న నాలుగు వరుసల మార్గంతోపాటు బకింగ్‌హామ్‌ కెనాల్‌పై ఉన్న కాలువ కట్ట రోడ్డును మూసేసి భద్రతా సిబ్బందిని నియమించారు. అటువైపు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. కాలువ కట్టలపై పేదలు కట్టుకున్న ఆవాసాలను తొలగించి, వారిని అక్కడి నుంచి పంపించారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారు. ఇబ్బందులపై మిన్నకుండిపోయారు. ఐదేళ్లుగా సమీప అపార్ట్‌మెంట్లలో నివసించే వారి వాహనాల రాకపోకలకూ వీల్లేదు. సొంతింటికి వెళ్లాలన్న ప్రతిసారి వారి గుర్తింపు కార్డులు చూపించి, వెళ్లాల్సిన దుస్థితి. తాడేపల్లి, సీతానగరం వైపు నుంచి దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వరకు కాలువకట్ట మార్గంలో రాకపోకలు సాగిస్తే వారికి దూరం తగ్గేది. దుగ్గిరాల, మంగళగిరి మండలాల నుంచి తాడేపల్లి, విజయవాడ నగరాలకు ఈ మార్గంలోనే వెళ్లేవారు. పాలు, పూలు, పండ్లు, కూరగాయలు తదితర నిత్యావసరాలు తెచ్చుకునేవారు. కేఎల్‌యూకు ఈ మార్గంలోనే రాకపోకలు సాగేవి. కాలువ కట్ట కిందభాగంలో నాలుగు వరుసల రోడ్డేసినా, అటువైపు కూడా ఇతరులెవరూ రాకపోకలు సాగించకుండా ఆంక్షలు విధించారు. కాలువ కట్టపై రోడ్డును కూడా మూసేశారు. దీంతో 1.5 కిలోమీటర్ల వరకు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కుప్పకూలి, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఈ మార్గాల్లో ప్రయాణాలకు అనుమతించాలని స్థానికులు వినతిపత్రాలు సమర్పించారు. పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి నుంచి ఆంక్షలు తొలగించి రాకపోకలకు అనుమతించారు. మరోపక్క, సామాన్యులు గజం ముందుకు జరిగి ఇల్లు కట్టుకుంటే పొక్లెయిన్లు పంపించి, తొలగించిన జగన్‌ ప్రభుత్వం.. ఆయన నివాసం వద్ద రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినా ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్గానికి నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని, ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకయ్యే ఖర్చును తామే భరిస్తామని చెబుతున్నారు. అక్కడి నుంచి తొలగించిన తెలుగు తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరుతున్నారు.


జగన్‌ నివాస మార్గంలో ప్రజలు


పేదల ఇళ్లు తొలగించిన ప్రదేశం


పంట ఉత్పత్తులు తెచ్చుకోలేకపోయాం
- సాంబిరెడ్డి, తాడేపల్లి

ఇన్నాళ్లూ పొలంలో పండించిన పంటను తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పురుగు మందులు, ఎరువులు తీసుకువెళ్లే బైక్‌లను అడ్డుకున్నారు. మేం రైతులం, తాడేపల్లి నుంచి వడ్డేశ్వరం, మెల్లెంపూడికి దగ్గరి మార్గమైనందున ఇటు నుంచి వెళ్తామని చెప్పినా పట్టించుకోలేదు. వ్యవసాయ పరికరాలను చుట్టూ తిరిగి మోసుకెళ్లాల్సి వచ్చేది. ఇన్నాళ్లకు ఉపశమనం లభించింది.


జనం సొమ్ముతో వేసిన రోడ్డుపై నడవొద్దా?
- బండి సాంబిరెడ్డి, తాడేపల్లి

ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో విలాసవంతంగా రోడ్డేసి, మమ్మల్ని నడవొద్దన్నారు. పంట ఉత్పత్తులు తరలించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కనీసం బంధువుల ఇళ్లకు వెళ్లడానికీ ఈ మార్గంలో రానీయలేదు. అపార్టుమెంట్లలో ఉండేవాళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పలేం. ఈ ప్రాంతంలో ఫ్లాట్లు కొనడానికి ఎవరూ రాలేదు.


డెలివరీ బాయ్‌గా ఎన్ని కష్టాలు పడ్డానో
- కిలాని మణికంఠ, ఫుడ్‌ డెలివరీ బాయ్‌

వడ్డేశ్వరంలో విద్యార్ధులకు ఆహారం డెలివరీ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాణ్ని. తాడేపల్లి నుంచి వడ్డేశ్వరం, కుంచనపల్లికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి కిలోమీటరున్నర అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. ఎన్ని ఇబ్బందులు పెట్టారో దేవుడికే తెలుసు.


ఇదేమైనా నిషిద్ధ ప్రాంతమా?
- వంశీ, కిరణ్, తాడేపల్లి

ప్రజల సొమ్ముతో వేసిన రోడ్డును జగన్‌ తన సొంతమన్నట్లు.. ఎవరినీ అడుగు పెట్టనీయలేదు. ఈ సెంటర్‌లో నిలబడితే సెక్యూరిటీ వారు తరిమివేసేవారు. అపార్టుమెంటుకు వెళ్తామన్నా, అనుమతించలేదు. అత్యవసర పనిమీద కుంచనపల్లి, వడ్డేశ్వరం వెళ్లాలంటే మరో రోడ్డులో ప్రయాణించాల్సి వచ్చేది. దీన్ని నిషిద్ధ ప్రాంతంగా మార్చారు. రోడ్డు తెరవడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది.


ఒక్కరి కోసం పేదల ఇళ్లు కూల్చేయాలా?
- పసుపులేటి అశోక్‌

సీఎం కోసం నిరుపేదల ఇళ్లను బలవంతంగా పొక్లెయిన్‌లతో కూల్చేసి, రోడ్డు వేసుకున్నారు. జగన్‌ తన విలాసవంతమైన ఇంటి పక్కన పేదలు ఉండకూడదని భావించి వారి ఇళ్లను తొలగించారు. ప్రజలను తన ఇంటిముందు రోడ్డులో నడవనీయలేదు. ఇక్కడ నిలబడినా, పోలీసులు జులుం ప్రదర్శించేవారు. ప్రజల డబ్బుతో రోడ్డును వేశామన్న సంగతి మర్చిపోయారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని