Machilipatnam: మేఘా కోసం ‘మెగా’ అంచనాలు!

వంతెనలు, భవనాలు కట్టే సివిల్‌ ఇంజినీర్‌తో శస్త్రచికిత్సలు చేయిస్తే ఎలా ఉంటుంది? జంతుశాస్త్రం బోధించే ఉపాధ్యాయుణ్ని తీసుకెళ్లి గణితం చెప్పమంటే ఎలా ఉంటుంది? ఏమాత్రం ఇంగితం ఉన్నవారైనా ఆ పని చేస్తారా?

Updated : 09 Jul 2024 04:24 IST

మచిలీపట్నం పోర్టు పనులు రూ.1,868 కోట్లకు చేస్తామన్న నవయుగ 
రూ.5,515 కోట్లకు పెంచేసిన జగన్‌ ప్రభుత్వం
అర్హత లేకపోయినా మేఘాకు అప్పగింత

ఈనాడు, అమరావతి: వంతెనలు, భవనాలు కట్టే సివిల్‌ ఇంజినీర్‌తో శస్త్రచికిత్సలు చేయిస్తే ఎలా ఉంటుంది? జంతుశాస్త్రం బోధించే ఉపాధ్యాయుణ్ని తీసుకెళ్లి గణితం చెప్పమంటే ఎలా ఉంటుంది? ఏమాత్రం ఇంగితం ఉన్నవారైనా ఆ పని చేస్తారా? కానీ జగన్‌ మాత్రం చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్ని మేఘాకు కట్టబెట్టేందుకు ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో అన్ని రకాల అడ్డదారులూ తొక్కారు. పోర్టు నిర్మాణ పనుల్ని సముద్రాల్లో జెట్టీలు, బెర్త్‌ల నిర్మాణం, బ్యాక్‌వాటర్, డ్రెడ్జింగ్‌ వంటి పనుల్లో అనుభవమున్న సంస్థలకు అప్పగిస్తారు. కానీ జగన్‌ ప్రభుత్వం వాటిలో ఏ మాత్రం అనుభవం లేని మేఘా సంస్థకు పోర్టు పనులు కట్టబెట్టింది. రవాణా, పట్టణాభివృద్ధి, సాగునీరు, పారిశ్రామిక ప్రాజెక్టుల్నీ ‘సిమిలర్‌’ వర్క్స్‌గా పేర్కొంటూ, ఆ పనులు చేసిన అనుభవమున్న సంస్థలూ టెండర్లలో పాల్గొనవచ్చని నిబంధనల్ని మార్చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి అతి పెద్ద దోపిడీ పర్వానికి తెరతీసింది. 

అంచనా వ్యయం భారీగా పెంపు

మచిలీపట్నం పోర్టు తొలిదశ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,868 కోట్లుగా పేర్కొంటూ అప్పట్లో నవయుగ సంస్థ ప్రతిపాదనలు అందజేసింది. దాన్ని జగన్‌ ప్రభుత్వం రూ.5,515 కోట్లకు పెంచేసింది. ఈ మొత్తంలో ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచిన పనుల విలువే రూ.3,670 కోట్లు. ఈపీసీ విధానంలో మొత్తం పోర్టు నిర్మాణ వ్యయాన్ని జగన్‌ ప్రభుత్వం అసాధారణ రీతిలో ఏకంగా రూ.11,463 కోట్లకు పెంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు సంస్థ (ఏపీఎంబీ)... రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో బిడ్లు ఆహ్వానించింది. ఆ క్రమంలో అన్ని రకాల ఉల్లంఘనలకూ పాల్పడింది. దేశంలో మరే పోర్టు టెండర్లలోనూ లేని విధంగా, అడ్డగోలుగా నిబంధనలు రూపొందించింది. సముద్రాల్లో పనులు చేయడం ప్రత్యేక నైపుణ్యంతో కూడిన వ్యవహారం. దేశంలోని వివిధ పోర్ట్‌ ట్రస్ట్‌లతో పాటు, ఇండియన్‌ నేవీ కూడా.. అలాంటి అనుభవమున్న సంస్థలకే పనులు అప్పగిస్తాయి. జగన్‌ ప్రభుత్వం ఆ పనుల్లో ఎలాంటి అనుభవం లేని మేఘా సంస్థకు మచిలీపట్నం పోర్టును కట్టబెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. టెండర్లలో పాల్గొనే సంస్థ.. బ్రేక్‌వాటర్, బెర్త్‌లు, డ్రెడ్జింగ్‌ వంటి పనుల్ని స్పెషలైజ్డ్‌ సబ్‌ క్రాంట్రాక్టర్ల సహకారంతో చేసుకోవచ్చంటూ టెండర్‌ నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది ఆ పనుల్లో ఏ మాత్రం అనుభవం లేని మేఘా సంస్థకు టెండర్‌ ప్రక్రియలో పాల్గొనేలా అర్హత కల్పించే ఎత్తుగడని విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన పనుల్ని మాత్రమే స్పెషలైజ్డ్‌ కాంట్రాక్టర్లతో చేయించేందుకు అంగీకరిస్తారు. ప్రాజెక్టులో ‘మేజర్‌ కాంపొనెంట్‌’ను స్పెషలైజ్డ్‌ కాంట్రాక్టర్లతో చేయిస్తామంటే కుదరదు. కానీ జగన్‌ ప్రభుత్వం మేఘా కోసం ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టేసింది. 


రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో డ్రామా

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంది. అడ్డంకులన్నీ తొలగించి, పోర్టుకు కొన్ని వేల ఎకరాల భూములు కేటాయించింది. 2019 ఫిబ్రవరి 8న పోర్టు తొలి దశ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. టెండర్‌ ప్రక్రియలో పాల్గొని అర్హత సాధించిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీకి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో, బీఓఎస్‌టీ (బిల్ట్, ఆపరేట్, షేర్, ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో పనులు అప్పగించారు. తర్వాత కొన్ని నెలలకే అధికారంలోకి వచ్చిన జగన్‌ 2019 ఆగస్టు 8న ఎలాంటి కారణం లేకుండా నవయుగ సంస్థను తప్పించారు. అస్మదీయ గుత్తేదారు సంస్థ మేఘాకు పనులు కట్టబెట్టడమే లక్ష్యంగా రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో డ్రామా ఆడారు. గత ప్రభుత్వం అనుసరించిన బీఓఎస్‌టీ పద్ధతిని.. గుత్తేదారు సంస్థకు మేలు చేసేలా ఈపీసీ విధానంలోకి మార్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని