Ramprasad Reddy: నేనూ రోడ్డు ప్రమాద బాధితుడినే: ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

‘రోడ్డుప్రమాదంలో కుటుంబ సభ్యులెవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో నాకు తెలుసు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవారు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. రాష్ట్రాన్ని ప్రమాదరహితంగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

Published : 24 Jun 2024 06:09 IST

11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయా
రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాదరహితంగా మార్చేందుకు కృషి

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాంప్రసాద్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘రోడ్డుప్రమాదంలో కుటుంబ సభ్యులెవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో నాకు తెలుసు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవారు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. రాష్ట్రాన్ని ప్రమాదరహితంగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. ప్రమాదాల నివారణకు రవాణాశాఖ తరఫున అన్ని చర్యలూ తీసుకుంటాను’ అని రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం సచివాలయంలో ఆయా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఏ రోడ్డుకూ పిడికెడు మట్టి వేయలేదు. ఒకటి, రెండు నెలల్లో రోడ్లు బాగుచేయడంపై దృష్టిపెడతాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరలో ఆరంభించి, వారి కళ్లలో ఆనందం చూడబోతున్నాం. అప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టడంపై సీఎంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం. జగన్‌ ప్రభుత్వం కొత్త బస్సులు ఏవీ కొనకుండా, తుక్కు అయిన బస్సులనే మరమ్మతులు చేయకుండా నడిపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్టీసీ స్థలాలను కాజేసిన వారి నుంచి వాటిని వెనక్కి తీసుకుంటాం. తక్కువ సొమ్ముతో బీఓటీ కింద విలువైన స్థలాలు తీసుకొని అక్కడ కార్యక్రమాలేవీ చేపట్టకపోతే వాటిని వెనక్కి తీసుకోనున్నాం. ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులను రెండు కళ్లలా చూసుకొని వారికి మేలు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, కార్యకలాపాలు మాత్రం సంస్థ ద్వారానే జరుగుతున్నాయి. కార్పొరేషన్‌ను పూర్తిగా విలీనం చేస్తాం. మాజీ సీఎం జగన్‌ తన సోకుల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుల నుంచి రుషికొండ వరకు భారీగా ఖర్చుచేశారు’ అని మంత్రి విమర్శించారు.

ఆడుదాం ఆంధ్రాలో సొత్తు తిన్నవారిని వదలబోం 

‘ఆడుదాం ఆంధ్రా అనే పనికిమాలిన కార్యక్రమాన్ని చివర్లో జగన్‌ నిర్వహించారు. దాని పేరిట ప్రజల సొత్తు తిన్నవారిని రోడ్డుపైకి తెస్తాం. దీనిపై విచారణలు జరుగుతున్నాయి. బాధ్యులు ఊచలు లెక్కించేలా చేస్తాం. గత ప్రభుత్వంలా ఏదో ఆడంబరంగా పది రోజులు కార్యక్రమాలు చేసి, ఇంట్లో కూర్చునేలా ఉండదు. నిరంతరం క్రీడలు నిర్వహిస్తాం. వచ్చే ఐదేళ్లలో క్రీడాశాఖ అందరికీ చేరువయ్యేలా చేస్తాను. విశాఖ స్టేడియం నుంచి క్రీడా పరికరాలను పులివెందుల స్టేడియానికి తీసుకెళ్లడం సరికాదు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులేవీ.. రాబోయే ఐదేళ్లూ జరగవు. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం’ అని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని