Manipur Election Results 2022: మణిపురాధీశులు కమలనాథులే!

మణిపుర్‌ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌

Updated : 11 Mar 2022 06:08 IST

పక్కా ప్రణాళికతో  భాజపా ఘన విజయం

ఈనాడు, గువాహటి: మణిపుర్‌ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ ఈసారి పూర్తిగా చతికిలపడింది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన భాజపా 32 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) ఈసారి ఆరు స్థానాలు సాధించింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి ఏడు, నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌)కు ఐదు సీట్లు దక్కాయి. కుకీ పీపుల్స్‌ పార్టీ అలయెన్స్‌ (కేపీఏ) రెండు, స్వతంత్రులు మూడు సీట్లను సాధించారు. 2002 నుంచి 2017 వరకూ వరుసగా మూడుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ దఫా ఐదు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, జనతాదళ్‌ (సెక్యులర్‌) పొత్తు పెట్టుకున్నప్పటికీ ‘హస్తం’ పార్టీకి కలిసిరాలేదు.

2017లో జరిగిన మణిపుర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28 స్థానాలు రాగా భాజపాకు 21 మాత్రమే వచ్చాయి. ఎన్‌పీపీ, ఎపీఎఫ్‌ తోడ్పాటుతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజా ఎన్నికలకు ముందు విభేదాలు రావడంతో భాజపా సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. భాజపా ఓట్ల శాతం 37.8కి పెరిగింది. కాంగ్రెస్‌ మాత్రం 16.8 శాతంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ హెయిన్‌గాంగ్‌  స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై 18,271 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ సీఎం ఇబోబీ సింగ్‌ విజయం సాధించారు. 

పల్లెలకు వెళ్లి... పర్వతాలు ఎక్కి...

రాజకీయ చాణక్యం ప్రదర్శించడంతోపాటు గత అయిదేళ్లలో ప్రజలలోకి విస్తృతంగా వెళ్లేందుకు భాజపా నాయకులు ప్రయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు రచ్చచేస్తున్నా సంయమనంతో వ్యవహరించి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ దృష్టి సారించారు. గ్రామాలకు వెళదాం (గో టు విలేజస్‌), కొండలకు వెళదాం (గో టు హిల్స్‌) వంటి ప్రణాళికల ద్వారా ఆయన జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఒక్క ఎన్‌కౌంటర్‌ కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి విలువ లేకుండా చేశామని పార్టీ నాయకులు ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి రథం జంట ఇంజన్ల మీద పరుగులు తీస్తుందన్న మోదీ ప్రచారం భాజపాకు కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.


జర్నలిస్టు నుంచి సీఎం వరకు..

ఇంఫాల్‌: మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌.. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1992లో ‘నహరోల్జి తౌడాంగ్‌’ అనే వార్తా పత్రికను ప్రారంభించి 2001 వరకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్‌ రెవల్యూషనరీ పీపుల్స్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్‌లోకి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. స్వల్ఫకాలంలోనే ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్‌ హయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2016లో కాంగ్రెస్‌తో విబేధించి భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎల్‌జేపీ, టీఎంసీల భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత బహిర్గతమైనప్పటికీ రాజకీయ చతురతతో సద్దుమణిగేలా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని