Andhra News: మూడేళ్ల ముప్పుతిప్పలకు... మూడు గంటల్లో పరిష్కారం చూపిన మంత్రి గొట్టిపాటి

సమస్యలకు స్పందించే ప్రభుత్వముంటే.. సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ. వైకాపా అధినేత జగన్‌ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినా.. ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు.

Updated : 10 Jul 2024 16:53 IST

పొలంలో దుక్కి చేయడానికి రైతు కుటుంబ సభ్యులు పడుతున్న పాట్లు

ఈనాడు, కడప: సమస్యలకు స్పందించే ప్రభుత్వముంటే.. సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ. వైకాపా అధినేత జగన్‌ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినా.. ఆయన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న రైతు గంగయ్య సమస్యకు పరిష్కారం చూపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల వ్యవధిలోనే ఆ అన్నదాత సమస్య తీరింది. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు నేలను తాకుతుండేవి. దాంతో పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరమని తెలిసినా తప్పక కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తి.. తర్వాత వదిలేవారు. ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు, ఎస్పీడీసీఎల్‌ అధికారుల దృష్టికి రైతు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం రైతు పొలానికి వెళ్లారు. ఎప్పటిలాగానే తీగలను పైకెత్తి.. దుక్కి చేస్తున్నారు. ఈ క్రమంలో దారిన వెళుతున్న కొందరు తమ ఫోన్లో ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఇది విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన ఆ జిల్లా ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమణతో ఫోన్లో మాట్లాడి.. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో ఆయన తమ సిబ్బంది ద్వారా విద్యుత్తు స్తంభాన్ని పొలానికి పంపించి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు.

 

మంత్రి గొట్టిపాటి ఆదేశాలతో విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేస్తున్న సిబ్బంది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని