Kollu Ravindra: కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతాం

రెండు మూడు నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు కోటి టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

Published : 08 Jul 2024 05:49 IST

43 లక్షల టన్నులు సిద్ధం
మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: రెండు మూడు నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు కోటి టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆదివారం మచిలీపట్నంలో కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఈ అంశంపై అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏ రీచ్‌లో ఇసుక కావాలనుకుంటే అక్కడి నుంచే కేవలం సీనరేజ్, లోడింగ్‌ ఛార్జీలు చెల్లించి రవాణా చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా రీచ్‌లకు వెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక రూపేణా ప్రభుత్వం ఒక్కపైసా కూడా వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు.  ప్రస్తుతం 120 స్టాక్‌ పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. అవసరం మేరకు నదుల్లో సిల్ట్‌ను కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా నిల్వ ఉన్న ఇసుకను రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన ఫైళ్లు, హార్డ్‌ డిస్క్‌లు దహనం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ అంశంలో అధికారులు, పాలకుల తప్పిదాలు ఉన్నట్లు గుర్తించామని, దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని