Ramoji Rao: విలువల శిఖరం రామోజీరావు

రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు నివాళి అర్పించారు.

Updated : 14 Jun 2024 06:42 IST

మంత్రి కోమటిరెడ్డి, సుబ్బిరామిరెడ్డిల నివాళి
దేశం గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయింది: లక్ష్మణ్‌

రామోజీరావు కుటుంబసభ్యులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి.
చిత్రంలో రేచస్‌ ఎల్ల, సహరి, శైలజా కిరణ్, కిరణ్, విజయేశ్వరి, కీర్తి సోహన

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు నివాళి అర్పించారు. గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసంలో ఆయన చిత్రపటం వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులైన.. ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేశ్వరి, రామోజీరావు మనవరాళ్లు సహరి, కీర్తి సోహన, సహరి భర్త రేచస్‌ ఎల్ల తదితరులను వారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న భాజపా నేత లక్ష్మణ్, పక్కన పీఎల్‌ శ్రీనివాస్‌

తెలుగు నేలకు విశేష సేవలు

రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలుగు మీడియా ఉన్నంత కాలం ఆయన కీర్తి ఉంటుందని తెలిపారు. ఒక కుగ్రామం నుంచి వచ్చి.. అనేక వ్యాపారాలను విజయవంతం చేసిన వ్యక్తిగా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. దశాబ్దాలుగా ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్‌తో పాటు అన్నదాత, తెలుగు-వెలుగు వంటి ప్రత్యేకతలతో తెలుగు నేలకు, భాషకు, ప్రజలకు విశేష సేవలు అందించిన విలువల శిఖరం రామోజీరావు అని పేర్కొన్నారు. జర్నలిజానికి దిక్సూచిగా నిలిచి.. ప్రభుత్వాలకు భయపడకుండా ప్రజల పక్షాన నిక్కచ్చిగా వార్తలు అందించారని కొనియాడారు. తాను 1986లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత.. మార్గదర్శిలో సభ్యుడిగా చేరి వ్యాపారాన్ని ప్రారంభించానని మంత్రి గుర్తుచేసుకున్నారు. ఎందరో సామాన్యులు మార్గదర్శిలో పొదుపు చేసిన సొమ్ముతో వ్యాపారాలు, పిల్లల పెళ్లిళ్లు చేశారని ఆయన అన్నారు.

ఆయన జీవితం స్ఫూర్తిమంతం

రామోజీరావు మృతితో దేశం గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రామోజీరావు విలువలతో కూడిన జీవితం గడిపారని అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. రామోజీరావు జీవితాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆదర్శాలను అలవర్చుకోవాలని సూచించారు. భాజపా నేత పీఎల్‌ శ్రీనివాస్‌ కూడా రామోజీరావుకు నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని