Nara Lokesh: విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తాం: లోకేశ్‌

విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద గంజాయి దొరికిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 11 Jul 2024 04:42 IST

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి దొరికిన ఘటనపై విచారణకు ఆదేశం
క్యాంపస్‌ సమస్యలపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్, అమరావతి: విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద గంజాయి దొరికిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్‌ రక్కసిని రాష్ట్రం నుంచి తమిరికొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు, విచ్చలవిడిగా గంజాయి లభ్యమవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ను కలిశారు. పిల్లలు విద్యాలయాల్లో గంజాయికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్‌ గంజాయిని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పదిలో పది గ్రేడ్లు సంపాదించిన తమ కుమార్తె క్యాంపస్‌లో చేరిన రెండో ఏడాది నుంచి వరుసగా ఫెయిలవుతోందని నెల్లూరుకు చెందిన విద్యార్థిని తండ్రి మంత్రి దృష్టికి తెచ్చారు. క్యాంపస్‌లోని విద్యార్థుల వద్ద బీడీలు, సిగరెట్లు, పాన్‌పరాగ్‌లు దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోధన సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొందరు విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని మరో విద్యార్థి తండ్రి తెలిపారు. ‘‘క్యాంపస్‌ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది లేరు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మ్యాథ్స్‌ అధ్యాపకులు నెలకోసారే వస్తున్నారని పిల్లలు ఆందోళన చెందుతున్నారు’’ అని ఓ విద్యార్థిని తల్లి మంత్రికి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని