Narayana: గత మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే రాజధాని

గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు.

Published : 17 Jun 2024 05:45 IST

రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి
ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ

సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ. చిత్రంలో అమరావతి రైతులు

ఈనాడు, అమరావతి: గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. సచివాలయంలోని రెండో బ్లాకులో వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రిగా నారాయణ ఆదివారం బాధ్యతలు చేపట్టాక విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి అభివృద్ధి పనులు మూడు దశల్లో నిర్వహించేలా గతంలోనే ప్రణాళిక రూపొందించి అమలుచేశాం. తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి. రెండో దశలో మెట్రోరైల్‌ పనులు చేపడతాం. తొలి దశలో చేపట్టే 3,600 కి.మీ. రహదారులు, సచివాలయం, అసెంబ్లీ, అధికారులకు 

నివాసాలవంటి పనులకు రూ. 48 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశాం. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో నిలిచాయి. వీటిని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్‌ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమమైన డిజైన్లు రూపొందించి అమలుచేశాం’ అని మంత్రి నారాయణ తెలిపారు. 

రాజధానిని నాశనం చేశారు

‘అత్యద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్‌పూలింగ్‌లో రైతులు వేల ఎకరాలనిస్తే.. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి నాశనం చేసింది. రైతులకు కౌలు సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. రాజధానిలో మూడు దశల్లో చేపట్టే పనుల పూర్తికి మొత్తంగా రూ.లక్ష కోట్ల వ్యయమవుతుందని అంచనా. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయం వంటివి ఇంకా కల్పించాలి. అధికారులతో చర్చించి పెండింగ్‌ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటాం. గతంలో పూర్తి చేసిన కొన్ని పనులను ధ్వంసం చేశారు. దీనిపై కమిటీ వేసి పరిశీలించి నివేదిక ఇచ్చాకే అలాంటి పనులు పూర్తి చేస్తాం. లేదంటే చేసిన పనులే మళ్లీ చేశారని బురదజల్లేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు’ అని మంత్రి అన్నారు.

అమరావతి సచివాలయం రెండో బ్లాకులో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ

3 వారాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ 

‘అన్న క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తాం. గతంలో తెదేపా ప్రభుత్వం 203 క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. వీటిలో 184 ప్రారంభించాం. 19 క్యాంటీన్ల భవనాల పనులు వివిధ దశల్లో నిలిచాయి. వీటి పూర్తికి అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించాం. పునరుద్ధరించే క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఇందుకు ఆ సంస్థ కూడా సంసిద్ధతను తెలిపింది. క్యాంటీన్ల భవనాల్లో నిర్వహిస్తున్న సచివాలయాలను ఇతర భవనాల్లోకి మార్చాలని అధికారులను ఆదేశించాం’ అని మంత్రి నారాయణ వివరించారు.

శ్రీలక్ష్మికి చుక్కెదురు 

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. అన్నక్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి ఆమె తెచ్చిన నోట్‌ఫైల్‌పై మంత్రి నారాయణ సంతకం పెట్టకుండా సున్నితంగా తిరస్కరించారు. మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే చంద్రబాబు సంతకం చేశారు. పునరుద్ధరణ ప్రక్రియ పురపాలక శాఖ పరిధిలోని అంశం కావడంతో నోట్‌ఫైల్‌ రూపొందించి మంత్రి నారాయణ బాధ్యతలు చేపట్టిన రోజునే ఆయనతో సంతకం చేయించి మంత్రిమండలి మొదటి సమావేశం ఎజెండాలో పెట్టించాలని అధికారులు భావించారు. ఆ మేరకు తెచ్చిన నోట్‌ఫైల్‌పై సంతకానికి అంత తొందరేముందని మంత్రి సున్నితంగా తిరస్కరించారు. ఈనెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి ప్రయత్నించినప్పుడు అనుమతి లేదని అధికారులు అడ్డుకుని సమావేశ మందిరంలోనే ఆమెను కూర్చోబెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని