Ramanaidu: సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం

అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Published : 16 Jun 2024 04:45 IST

పోలవరానికి తొలి ప్రాధాన్యం
మంత్రి రామానాయుడు

ఈనాడు డిజిటల్, అమరావతి: అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు ఎన్జీటీ రూ.వంద కోట్ల జరిమానా విధించిందంటే జగన్‌ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చేసిన అక్రమాల్ని త్వరలోనే బయటపెడతామని వెల్లడించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రతి ప్రాజెక్టులో 40% నిధుల్ని జే గ్యాంగ్‌ కమీషన్ల రూపంలో దోచుకుంది. పోలవరం ప్రాజెక్టులో 2% పనులే చేసి.. దాన్ని నాశనం చేశారు. పోలవరం పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం’’ అని నిమ్మల తెలిపారు.


జలవనరుల శాఖకు మళ్లీ జవసత్వాలు తెస్తా

మంత్రి నిమ్మల రామానాయుడికి స్వాగతం పలుకుతున్న సాగునీటి సంఘాల సమాఖ్య నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ,
గుత్తా శివరామకృష్ణ, పుల్లయ్య చౌదరి, మురళీకృష్ణ తదితరులు 

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: వైకాపా హయాంలో నిర్వీర్యమైన ఏపీ జలవనరుల శాఖకు తిరిగి జవసత్వాలు తెస్తామని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విజయవాడలోని జలవనరుల శాఖ విడిది కార్యాలయాన్ని, వివిధ విభాగాలను శనివారం ఆయన సందర్శించారు. ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, జలవనరుల శాఖ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, రేవు సతీష్‌కుమార్, సీఈలు బి.శ్రీనివాస్‌ యాదవ్, కె.శ్రీనివాస్, ఎస్‌ఈ ప్రసాద్‌బాబు, కేసీ డివిజన్‌ ఈఈ కృష్ణారావు తదితరులు శాఖాపరమైన పరిస్థితులను మంత్రికి వివరించారు. తొలిసారిగా విచ్చేసిన మంత్రి నిమ్మలకు ఆళ్ల గోపాలకృష్ణ నేతృత్వంలో స్వాగతం పలికారు. ఆళ్ల మాట్లాడుతూ.. వైకాపా హయాంలో రైతులను జలవనరుల శాఖ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారని, తెదేపా గెలుపుతో ఇక్కడ నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని