Nimmala Ramanaidu: అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?

‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు?

Published : 06 Jul 2024 05:29 IST

అధికారులను నిలదీసిన మంత్రి రామానాయుడు

ఈనాడు, అమరావతి: ‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? ప్రవాహం ఎప్పుడు వస్తుందో, డ్యాం గేట్లు ఎప్పుడు ఎత్తాలో అధికారులకు తెలుసు కదా? డ్యాం కింద ఇసుక నిల్వలు ఉన్నాయని, పొక్లెయిన్లు, వాహనాలు ఉన్నాయని తెలియదా? గేట్లు ఎత్తకపోవడం వల్ల రెండు ఊళ్లు కొట్టుకుపోయి 30 మందికి పైగా చనిపోయారు. బాధ్యతాయుతమైన అధికారులు ఇలా ఉంటే ఎలా’ అని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను నిలదీశారు. సచివాలయంలో శుక్రవారం ఆయన రాష్ట్రంలోని సీఈలు, ఎస్‌ఈలతో సమావేశమయ్యారు. ‘అప్పటి అధికారులు ఈ సమావేశంలో ఉన్నారా... సమాధానం చెప్పండి. పులిచింతల ప్రాజెక్టును ఎందుకు ఖాళీ చేశారు? ప్రకాశం బ్యారేజికి అది బ్యాలెన్సింగ్‌ జలాశయం. మొత్తం 45 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ ఉండాల్సిన ప్రాజెక్టులో 0.5 టీఎంసీలే ఉన్నాయి. రాజకీయాల కోసం నీళ్లను ఇలా ఇష్టమొచ్చినట్లు వాడేయడం తప్పు కాదా? తాగునీటికి నీళ్లు దాచుకోకుండా ఇలా ఎమ్మెల్యేలు చెప్పారని నీళ్లు ఇచ్చేస్తే ఎలా’ అని ఆయన ప్రశ్నించారు. వర్షాలు లేకపోవడం వల్ల పులిచింతల ఖాళీ అయిందని అధికారులు సమాధానం చెప్పారు. పట్టిసీమను ఉపయోగించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంత్రి రామానాయుడు నిలదీశారు. చంద్రబాబు అప్పట్లో ముందుచూపుతో పట్టిసీమ నిర్మించినందున ఇప్పుడు కృష్ణా డెల్టాకు తాగునీళ్లు ఇవ్వగలుగుతున్నామని, లేకపోతే ఎంత దారుణ పరిస్థితులు ఉండేవని ఆయన అధికారులను ప్రశ్నించారు. పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడం తదితర అంశాలపైనా అధికారులను నిలదీశారు. ఆ సమావేశం తర్వాత సచివాలయంలో రామానాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల కమిటీ తన నివేదికను నెల రోజుల్లో ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.  


అత్యవసర పనులపై జలవనరులశాఖ దృష్టి

రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులపై జలవనరులశాఖ దృష్టి సారించింది. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం అనేక నిర్వహణ పనులనూ నిర్లక్ష్యం చేసింది. ఏ ప్రాజెక్టులోనూ గేట్లకు గ్రీజు కూడా పూయని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు పెరిగి వరదలు రాకముందే, కాలువలకు నీళ్లు వదలక ముందే అత్యవసర పనులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్‌ఈలను తగిన ప్రతిపాదనలతో సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) నిధులతో దాదాపు రూ.70 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు. ప్రస్తుత అవసరం అంతకుమించి ఉంది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) నిధులతో అత్యవసర పనులు మంజూరుచేసి, చేపట్టాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు