Ramanaidu: పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం

‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది.

Published : 04 Jul 2024 05:14 IST

నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల

పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మీటనొక్కి నీటిని విడుదల చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు, పక్కన ఎమ్మెల్యేలు ధర్మరాజు, బాలరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి తదితరులు

ఈనాడు, ఏలూరు: ‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. తెదేపా ప్రభుత్వం చేపట్టిన పథకం కావడంతో జగన్‌ పట్టిసీమను ఒట్టిసీమ అంటూ అవహేళన చేశారు. నేడు బంగారు సీమగా లక్షల ఎకరాలకు సాగునీరు..వేల గ్రామాలకు తాగునీరు అందిస్తోంది’ అని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పశ్చిమలో 920 పనులకు అంచనాలు సిద్ధం చేశామని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఆయన బుధవారం ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. మూడు మోటర్ల మీట నొక్కి చేసి 1050 క్యూసెక్కుల నీటికి పోలవరం కుడి కాలువలోకి విడుదల చేశారు. ముందుగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేసింది.పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతో పాటు, రాయలసీమలో తాగు, సాగు అవసరాలు తీరుస్తాం. 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తాం’ అని నిమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసి పరిహారం..పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ పాల్గొన్నారు. 

పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదలను పరిశీలిస్తున్న మంత్రి రామానాయుడు తదితరులు

తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల

సీతానగరం, తాళ్లపూడి, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి, సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి బుధవారం సాగునీటిని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఆగస్టులో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నట్లు సాంకేతిక నిపుణల బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టును దెబ్బతీసిన వైకాపా పాలకులు ఇప్పటికీ దానిపై విషప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో జలవనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా కాపాడేవారని పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని ఎప్పుడూ రిజర్వులో ఉంచేవారని మంత్రి గుర్తుచేశారు. వైకాపా పాలనలో ఒక్క టీఎంసీ నీరు కూడా లేదన్నారు. తెదేపా హయాంలో రూ.7 లక్షల కోట్ల బడ్జెట్‌లో జలవనరులశాఖకు రూ.80వేల కోట్లు కేటాయిస్తే, జగన్‌ ప్రభుత్వంలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేవలం రూ.30 వేల కోట్లే ఇచ్చారన్నారు. అందులోనూ 50 శాతానికి పైగా నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పురుషోత్తపట్నం రైతులకు ఇవ్వాల్సిన పరిహారంతోపాటు ప్రాజెక్టుకు ఉన్న ఎన్జీటీ అంశాలను, న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు