AP news: సభా గౌరవం.. హుందాతనాన్ని పెంచాలి

శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం శాసనసభలో ప్రసంగించారు.

Published : 23 Jun 2024 04:39 IST

శాసనసభలో మంత్రులు

ఈనాడు, అమరావతి: శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం శాసనసభలో ప్రసంగించారు. 

అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపల్‌గా ఉండాలి: మంత్రి సత్యకుమార్‌

‘అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపల్‌గా అయ్యన్న వ్యవహరిస్తారనే నమ్మకం ఉంది. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసింది. చితికిపోయిన ఆర్థికవ్యవస్థను సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. నరేంద్రమోదీతో కలిసి గాడిన పెడతారనే నమ్మకం ఉంది. ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండానే వాకౌట్‌ చేశారు. ఈ మానసికస్థితి వల్లే ప్రజలు వారిని నాకౌట్‌ చేశారు. గత ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉత్తరాంధ్ర పక్షాన అయ్యన్నపాత్రుడు ఎలుగెత్తి పోరాడారు.’ 

గత సభలో సభ్యులపై దాడులు: మంత్రి అచ్చెన్నాయుడు

‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్న కొందరు వ్యక్తులు.. బలహీనవర్గాల వ్యక్తిని సభాపతిగా కూర్చోబెడితే చూడడానికి ఇష్టపడకపోవడం బాధాకరం. 2019-24 మధ్య దుర్మార్గమైన సభ ఉంది. మా స్థానాల్లో మేము కూర్చున్నా.. మా దగ్గరికి వచ్చి కుటుంబసభ్యులను తిట్టారు. వినలేక చెవుల్లో దూది పెట్టుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ ఎమ్మెల్యేపై భౌతికదాడులు జరగలేదు. గత శాసనసభలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడిచేశారు. ఈ రోజు నుంచి మీ అవతారాన్ని మార్చాలి. ఈ సభ దేశానికి ఆదర్శంగా ఉండాలి.’

సమావేశాలు అందరూ చూసేలా ఉండాలి: మంత్రి అనిత

‘గత ఐదేళ్లు సమావేశాలు చూడకుండా టీవీలు కట్టేసేవారు. అలా జరగకుండా చూడాలి. గత ప్రభుత్వంలో కేసులు పెట్టి వేధించినా ధైర్యంగా నిలబడిన ధీరుడు అయ్యన్నపాత్రుడు. ఆరు అడుగుల దూరం చూపించి, గోడ కూల్చడానికి వందలమంది పోలీసులను పెట్టారు. అయినా ఆయన భయపడలేదు. వైకాపా ఎమ్మెల్యేలు వచ్చి సభాపతిని కూర్చోబెట్టడం సంప్రదాయం. వైకాపా వారికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా రాదని అర్థమైంది’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని