Monsoon: ఉత్తరాంధ్రకు విస్తరించని ‘నైరుతి’

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. మూడు రోజులు ముందుగా ఈ నెల 2న రాష్ట్రంలోకి ‘నైరుతి’ ప్రవేశించింది. తర్వాత వేగంగా ముందుకు కదిలేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా వర్షాలు ఆశాజనకంగా లేవు.

Updated : 15 Jun 2024 08:48 IST

మరో 2-3 రోజులు పట్టే అవకాశం
నేడు పలు జిల్లాల్లో వర్షాలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. మూడు రోజులు ముందుగా ఈ నెల 2న రాష్ట్రంలోకి ‘నైరుతి’ ప్రవేశించింది. తర్వాత వేగంగా ముందుకు కదిలేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా వర్షాలు ఆశాజనకంగా లేవు. ఈ నెల 8 నాటికి గోదావరి జిల్లాలను దాటిన ‘నైరుతి’ శుక్రవారం నాటికి పూర్తిగా ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పూర్తిగా విస్తరించేందుకు మరో 2-3 రోజులు పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శుక్రవారం విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా రాజాంలో 78.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని