YS Avinash Reddy: ఎంపీ సై అంటే ఇక్కడ కొలువు

మాజీ సీఎం జగన్‌ ఇలాకా.. వైఎస్సార్‌ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి ఎవరి పేరు చెబితే వారికి వీటిలో ‘పొరుగు సేవల’ కింద ఉద్యోగాలు దక్కుతున్నాయి. వైకాపా పాలనలో వందలమంది తమ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉద్యోగాలు లభించాయి.

Updated : 19 Jun 2024 07:34 IST

అవినాష్‌ అనుయాయులకే ఉద్యోగాలు
వైకాపా కార్యకర్తల పునరావాస కేంద్రాలైన వర్సిటీలు
ప్రైవేటు క్యాంటీన్లూ వైకాపా వారికే 
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప, వైవీయూ

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ

మాజీ సీఎం జగన్‌ ఇలాకా.. వైఎస్సార్‌ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి ఎవరి పేరు చెబితే వారికి వీటిలో ‘పొరుగు సేవల’ కింద ఉద్యోగాలు దక్కుతున్నాయి. వైకాపా పాలనలో వందలమంది తమ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉద్యోగాలు లభించాయి. వర్సిటీ కులపతిగా పనిచేసిన వ్యక్తి కూడా పదుల సంఖ్యలో ఉద్యోగాలు వేయించుకున్నారు. ఇడుపులపాయ కేంద్రంగా ఉన్న రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలు ఉన్నాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ప్రతిదీ రాజకీయమైంది. ఎంపీ ఎవరికి చెబితే వారికి ఉద్యోగాలు, ప్రైవేటు క్యాంటీన్లు ఇచ్చారు. రెండు, మూడు పోస్టులు సృష్టించి వాటిలో ఇదివరకే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన వారిని కూర్చోబెట్టి రూ.వేలల్లో జీతాలు చెల్లిస్తున్నారు. వారి వల్ల ట్రిపుల్‌ఐటీకి గాని, విద్యార్థులకు గానీ ఎలాంటి ప్రయోజనం లేదు.  

వైకాపా ప్రభుత్వ హయాంలో ట్రిపుల్‌ఐటీలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను పులివెందుల పట్టణంలోని అమ్మవారిశాల వీధికి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ట్రిపుల్‌ఐటీ అధికారులు సిబ్బంది కావాలని ఆ ఏజెన్సీకి లేఖ రాస్తే వెంటనే ఎంపీ తమ కార్యకర్తల పేర్లు పంపించి వాటిని భర్తీ చేయిస్తున్నారు. ఇలా ఈ ఐదేళ్లల్లో 150 మందికి పైగా పొరుగు సేవల కింద నియమించారు. ఒక్కొక్కరికి రూ. 15,000 నుంచి రూ. 18,500 వరకు జీతం అందుతోంది. ఇడుపులపాయకు చెందిన వైకాపా కార్యకర్తలే 100 మందికి పైగా వివిధ విభాగాల్లో చేరిపోయారు. ఒక్కో ఇంట్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సామూహికంగా ఉద్యోగాల్లో చేరారు. యూనివర్సిటీ కులపతి సైతం ఇక్కడ 20కు పైగా ఉద్యోగాలు వేయించుకున్నారు.

కోడ్‌ ఉన్నా బరితెగింపు.. 

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో డైరెక్టరు, ఇతర అధికారులు బరితెగించి 36 పోస్టుల భర్తీ చేసుకోడానికి ప్రయత్నించగా, తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి జోక్యంతో ఆగిపోయింది. మార్చి 3వ వారంలో ఈ పోస్టుల భర్తీకి డైరెక్టర్‌ కుమారస్వామి గుప్త ప్రయత్నించారు. ఎంపీ సిఫారసుతో వచ్చిన వారిని గుట్టుచప్పుడు కాకుండా పొరుగు సేవల సిబ్బంది కింద తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉండగా ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని మండిపడుతూ కలెక్టర్‌ విజయ రామరాజును కలిసి ఫిర్యాదుచేశారు. దీంతో 36 పోస్టుల భర్తీ ఆగిపోయింది. 

యోగి వేమన విశ్వవిద్యాలయంలో 120 మందిని ఒప్పంద పద్ధతిలో తీసుకోగా, వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో మొదట 75 మందిని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోనూ మరో 20 మందిని నియమించారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 250 మంది అనుయాయులను నియమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. 

కార్యకర్తలకే ప్రైవేటు క్యాంటీన్లు

ఎంపీ చెప్పిన వారికే ట్రిపుల్‌ఐటీలో ఉన్న నాలుగు క్యాంటీన్లను అప్పగించారు. అధికార పార్టీ కాబట్టీ నాసిరకం ఆహారం అందించినా ఎవరూ ప్రశ్నించే వారుండరు. క్యాంటీన్ల నిర్వాహకులు తామున్న గదులకు నెల నెలా అద్దె వర్సిటీకి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వాటిని కూడా నిర్వాహకులు సక్రమంగా కట్టడంలేదు. 

అక్రమాల నిగ్గు తేల్చుతాం 

ఈ మూడు వర్సిటీల్లో జరిగిన అక్రమాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లి నిగ్గుతేల్చుతామని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని