Delhi Liquor Scam: నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు: ఎంపీ మాగుంట

తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తాము ధైర్యంగా ఉన్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టంచేశారు.

Updated : 25 Feb 2023 07:25 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తాము ధైర్యంగా ఉన్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టంచేశారు. దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రాఘవరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారంలో ఉందని, 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని తెలిపారు. తనకూ యాభై ఏళ్ల అనుభవం ఉందని... ఎక్కడా తప్పుచేయలేదన్నారు. అరెస్టు తర్వాత రాఘవరెడ్డిని కోర్టు వద్ద కలిశానని... ఆ సందర్భంగా ‘నాన్నా, నీకు తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చేయను. పెద్దనాన్న సుబ్బరామిరెడ్డి గారి పేరును అప్రతిష్ఠపాలు చేయను’ అని నాకే ధైర్యం చెప్పినప్పుడు గర్వంగా అనిపించిందన్నారు. ఇలాంటి కొడుకును ఇచ్చినందుకు దేవునికి జన్మజన్మలకు రుణపడి ఉంటానన్నారు.

రాఘవరెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర: బాలినేని

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానం ఉందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం... ఒంగోలులో ఎంపీ మాగుంటను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మాగుంట కుటుంబంపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. జిల్లాకు వారు చేసిన మంచి కార్యక్రమాలను ఎవరూ మరిచిపోరన్నారు. మాగుంట కుటుంబానికి పార్టీతోపాటు ప్రకాశం జిల్లా ప్రజలు అండగా ఉంటారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని