Nadendla Manohar: పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ

రేషన్‌లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువ బరువే.

Updated : 16 Jun 2024 07:31 IST

ప్రతి ప్యాకెట్‌కు 50 నుంచి 100 గ్రాములు తక్కువే
మంత్రి మనోహర్‌ తనిఖీల్లో బయటపడిన వైనం
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ నిలిపివేత.. విచారణకు ఆదేశం

కందిపప్పు ప్యాకెట్ల బరువును పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తెనాలి టౌన్‌: రేషన్‌లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువ బరువే. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవమిది. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది.  దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఆ మాత్రం తేడా ఉండదా?

కొత్త ప్రభుత్వం.. అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా? అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుంది. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా? మిగిలినచోట్ల కూడా ఇలాగే ఉంటుందా? అని మంత్రి అధికారుల్ని ప్రశ్నిస్తే.. వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మంగళగిరిలోనూ తనిఖీచేయాలని ఆదేశించారు. తనిఖీ చేయగా.. అక్కడ కూడా తూకం తక్కువగానే ఉన్నట్లు వెల్లడైంది.

గోదాములో అధికారులను ప్రశ్నిస్తున్న మంత్రి 

రాష్ట్రవ్యాప్తంగా భారీ దోపిడీ 

రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్‌ నుంచి.. అంగన్‌వాడీ, వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. తూకం ఒక్కటే కాదు. ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. ఇదంతా అధికారులకు తెలియనిదేం కాదు. వారి సహకారంతో ఇష్టారాజ్యంగా ఐదేళ్ల నుంచి సాగుతోంది. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనే రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోంది. తూకం లేకుండానే.. ఒక్కో బస్తా 50 కిలోల లెక్కన పంపిస్తున్నారు. వాస్తవానికి బస్తాకు 5-8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటోంది. అయినా అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు నోరు మెదపడం లేదు. ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖలో రూ.వందల కోట్ల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపైనా కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే.. మరెన్నో వాస్తవాలు బయటకొస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని