Nara Lokesh: ఒక్క మెసేజ్‌ పెట్టండి.. వెంటనే స్పందిస్తా

‘ఏ సహాయం కావాలన్నా  ఒక అన్నగా చేస్తా. ఏ ఇబ్బంది వచ్చినా వాట్సప్‌లో సందేశం పంపిస్తే చాలు.. వెంటనే స్పందిస్తా’ అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ యువత, విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు.

Published : 09 Jul 2024 04:36 IST

యువతకు మంత్రి లోకేశ్‌ భరోసా 
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల అందజేత

విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ అందజేస్తున్న మంత్రి లోకేశ్‌ 

ఈనాడు, అమరావతి: ‘ఏ సహాయం కావాలన్నా  ఒక అన్నగా చేస్తా. ఏ ఇబ్బంది వచ్చినా వాట్సప్‌లో సందేశం పంపిస్తే చాలు.. వెంటనే స్పందిస్తా’ అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ యువత, విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. మంత్రి చొరవతో జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించిన 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉండవల్లి నివాసంలో కలిశారు. విద్యార్థులను అభినందించిన మంత్రి లోకేశ్‌ వారందరికీ సొంత ఖర్చుతో ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అర్హత ఉన్నా చిన్న సాంకేతిక సమస్య వల్ల జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోతున్నట్లు పృథ్వీ అనే విద్యార్థి నాకు వాట్సప్‌లో సందేశం పెట్టారు. ఏం చేస్తారో తెలియదు.. ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదని వెంటనే అధికారులను పిలిచి చెప్పాను. వారు ఐఐటీ మద్రాస్‌తో సంప్రదింపులు జరిపి, జీఓ తీసుకురావాలని చెప్పారు. క్షణం ఆలస్యం లేకుండా ఉత్తర్వులు ఇచ్చాం. అమెరికాలో చదువుకున్నప్పటికీ ఐఐటీ, ఎన్‌ఐటీలో చదవాలన్నది నా కలగా ఉండేది. జాతీయస్థాయిలో పేరున్న ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సాధించిన ఈ విద్యార్థులంతా ఛాంపియన్లు. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి వచ్చిన వెంటనే శరవేగంగా పని చేసిన అధికారులందరికీ అభినందనలు. ఇంకా మరికొందరికి సమస్య ఉందని తెలిసింది. వారికి కూడా సాయం చేస్తా’ అని అన్నారు. 

ఆ రోజు ఆనందంగా నిద్రపోయా

‘25 మందికి సీట్లు వచ్చాయని తెలిసిన రోజున ఆనందంగా నిద్రపోయా. నా బిడ్డకు అనారోగ్యం వస్తే ఎంత కంగారుపడతానో మీ బాధను కూడా అలాగే భావించాను. మీరంతా చదువు పూర్తయ్యాక మళ్లీ అమరావతికి వచ్చి సేవలందించాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు.. మీకు సాయం చేశా. మీరు కూడా మరో 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి’ అని ఆ విద్యార్థులతో చెప్పారు. ఒక్క ఏడాదిలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పని చేస్తామన్నారు. పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.  

విద్యాశాఖను సవాల్‌గా తీసుకున్నా.. 

‘నేను విద్యాశాఖ తీసుకుంటున్నా అంటే మిత్రులు భయపెట్టారు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి శాఖ తీసుకుంటే ఇబ్బంది పడతావని చెప్పారు. స్టాన్‌ఫోర్డులో చదువుకున్న నేనే విద్యాశాఖ తీసుకోవడానికి భయపడితే ఇక ఎవరు తీసుకుంటారు? అందుకే సవాల్‌గా తీసుకుని చేస్తున్నా. ఏళ్ల తరబడి విద్యా శాఖలో ఉన్న సమస్యలను.. వచ్చే ఏడాదిలోగా పరిష్కరించడమే మా లక్ష్యం’ అని వెల్లడించారు. రాష్ట్రంలో యువతకు ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్‌ చెప్పారు. బటన్‌ నొక్కితే దివ్యాంగుల సర్టిఫికెట్లు నేరుగా వచ్చేలా ఆరు నెలల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమయానికి అందేలా చూస్తామన్నారు. విద్యాశాఖలో అంతా గందరగోళంగా ఉందని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై అధ్యయనం చేస్తున్నానని, ఐదేళ్లలో పాఠశాలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.


వ్యవస్థపై నమ్మకం పెరిగింది: పృథ్వీ తండ్రి జయరామ్‌

విద్యార్థుల సమస్యపై మంత్రి లోకేశ్‌ను కలవాల్సిన పని లేదు.. మెసేజ్‌ పెడితే చాలని స్నేహితులు చెప్పారు. సందేశం పెట్టిన అర్ధగంటలోనే స్పందించారు. ఇది చూశాక వ్యవస్థపై నమ్మకం పెరిగింది.


జీవితంలో మర్చిపోలేం: గోకుల్‌ సాయి తండ్రి రామకృష్ణ

ఆఘమేఘాలపై జీఓ తెచ్చి మా బిడ్డల భవిష్యత్తు కాపాడారు. మీ సాయాన్ని జీవితంలో మర్చిపోలేం. 


బిడ్డ ముఖంలో ఆనందం చూశాం: తేజిత తల్లి

మిమ్మల్ని కలిశాక మా బిడ్డ ముఖంలో ఆనందం చూశాం. మీకు రుణపడి ఉన్నాం. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మా దగ్గర మాటలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని