Nara Lokesh: మంత్రి లోకేశ్‌ చొరవతో.. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీటు దక్కినా.. ఐఐటీ మద్రాస్‌ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సత్వర చొరవతో న్యాయం జరిగింది.

Published : 08 Jul 2024 04:54 IST

దివ్యాంగ విద్యార్థుల మెమోలు సవరించి, ప్రత్యేక జీవో జారీ చేయించిన మంత్రి
ఫలితంగా సుమారు 25 మందికి లబ్ధి 

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీటు దక్కినా.. ఐఐటీ మద్రాస్‌ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సత్వర చొరవతో న్యాయం జరిగింది. మార్కుల మెమోలను సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేయించడంతో రాష్ట్రానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం దక్కింది. తమ సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకున్న ఆ విద్యార్థులనూ సోమవారం లోకేశ్‌ అభినందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనల ప్రకారం.. దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్‌ సబ్జెక్టులు రెండింటిలో ఒక దానికి మినహాయింపు ఉంది. ఆ సబ్జెక్టుకు సంబంధించి ‘ఇ (ఎగ్జంప్షన్‌)’ అని పేర్కొంటూ మార్కుల జాబితా జారీ చేస్తున్నారు. ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్‌ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్‌ నిబంధనలు మార్చింది. ఇంటర్‌లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ఇంటర్‌ బోర్డు అలా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. 

సమస్య తెలిసిన వెంటనే.. సత్వర పరిష్కారం

ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృథ్వీ సత్యదేవ్‌ దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించారు. జోసా కౌన్సెలింగ్‌ పత్రాల పరిశీలన క్రమంలో మెమోలో నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఉండటంతో ఐఐటీ మద్రాస్‌ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్‌ జూన్‌ 22న సమస్యను మంత్రి లోకేశ్‌కు వాట్సప్‌ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థి, ఆయన తండ్రి జయరామ్‌తో మాట్లాడారు. మెమోలో ‘ఇ’ బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కులను ‘ఇ’ గా పేర్కొన్న ఐదో సబ్జెక్టుకు వేశారు. దాంతో కొత్త మెమో ఇచ్చారు. దీనిపై కూడా ఐఐటీ మద్రాస్‌ అధికారులు మరో మెలిక పెట్టారు. ఏపీ ప్రభుత్వ జీవో కావాలని స్పష్టం చేశారు. సత్యదేవ్‌ మరోసారి మంత్రి పేషీలో సమస్య వివరించగా.. లోకేశ్‌ అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని, సత్వరమే జీవో విడుదల చేయాలని, అవసరమైతే ఐఐటీ మద్రాస్‌ అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్‌కు రౌండ్‌-1లోనే సీటు దక్కింది. ఈ ఉత్తర్వు కారణంగా రాష్ట్రంలో 25 మందికి జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు దక్కాయి. 


అరగంటలోనే స్పందించారు 
- పృథ్వీ సత్యదేవ్, విజయవాడ

మార్కుల జాబితాను మద్రాసు ఐఐటీ అధికారులు తిరస్కరించడంతో మంత్రి లోకేశ్‌కు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టాను. అరగంటలోనే స్పందించారు. సమస్య పరిష్కారం అయిందో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. సీటుపై ఆశలు వదులుకున్నా. లోకేశ్‌ చొరవతో సీటొచ్చింది.


భవిష్యత్తు ముగిసిందనుకున్నాం
- రఘునాథరెడ్డి, కడప

మార్కుల మెమోపై కౌన్సెలింగ్‌ అధికారులు కొర్రీలు వేయడంతో మా భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్నాం. సమస్యను లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. తాను చూస్తానని, అధైర్యపడొద్దని చెప్పారు. అధికారులతో మాట్లాడి జీవో ఇప్పించారు. ఎన్‌ఐటీ కాలికట్‌లో సీటు వచ్చింది.


ఐఐటీ గువాహటిలో చేరుతున్నా 
-తేజిత చౌదరి, తిరుపతి 

ఇంజినీరింగ్‌ తర్వాత సివిల్స్‌ రాసి ప్రజాసేవ చేద్దామనుకున్నా. మంత్రి లోకేశ్‌ మాలో కొండంత ఆత్మవిశ్వాసం నింపారు. ఆయనకు మా కృతజ్ఞతలు. ఐఐటీ గువాహటిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతున్నాను.


నేతలపై గౌరవం పెరిగింది
- స్నేహిత, నెల్లూరు

మంత్రి లోకేశ్‌ స్పందించి జీవో ఇప్పించడంతోనే.. ఉన్నత చదువులకు అవకాశం కలిగింది. ఆయన పనితీరు చూశాక రాజకీయ నేతలపై గౌరవం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని