Nara Lokesh: విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి

రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించారు.

Published : 16 Jun 2024 06:30 IST

అధికారులకు మంత్రి లోకేశ్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా ధ్రువపత్రాలు కళాశాలల్లోనే వదిలేయాల్సి వచ్చిందని పాదయాత్ర సమయంలో వేల మంది విద్యార్థులు వాపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ‘2018-19 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వివరాలు, ఈఏపీ సెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీ ఏ మేరకు ఇవ్వాలి, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు ఏ మేరకు ఉండాలనే అంశాలపై నివేదిక ఇవ్వాలి. ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రాష్ట్ర విభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఎల్‌ఎమ్‌ఎస్‌) ఫలితాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గడంపై సమగ్ర నివేదికలు సమర్పించాలి. విశ్వవిద్యాలయాల ర్యాంకులు పడిపోవడానికి కారణాలు అధ్యయనం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చేయాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి. వివాదాస్పదమైన ఉప కులపతుల నియామకాలు, వర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపైన నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం లోగా నివేదికలు ఇస్తే అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు మంత్రి లోకేశ్‌ తెలిపారు.

త్వరలో నూతన ఐటీ పాలసీ: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పేరున్న సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ సూచించారు. త్వరలోనే నూతన ఐటీ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. శనివారం ఆయన ఐటీశాఖ ముఖ్య అధికారులతో సమీక్షించారు. ఐటీ పరిశ్రమల్ని తీసుకురావడానికి ప్రకటించాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఏర్పాటైన వాటికి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలపై ఆరా తీశారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం.రమణారెడ్డి, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈఓ అనిల్‌కుమార్, ఆర్టీజీఎస్‌ డైరెక్టర్‌ చెరుకువాడ శ్రీరామ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని