Rushikonda: శీష్‌ మహల్‌ ఆఫ్‌ ద సౌత్‌!

రాష్ట్రానికి మరో 30 ఏళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న భ్రమలో విశాఖపట్నంలోని రుషికొండపై సుమారు రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి జగన్‌ అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లు నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Updated : 20 Jun 2024 07:38 IST

రుషికొండ ప్యాలెస్‌లపై జాతీయ స్థాయిలో చర్చ
ఎండగడుతున్న జాతీయ టీవీ ఛానళ్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి మరో 30 ఏళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న భ్రమలో విశాఖపట్నంలోని రుషికొండపై సుమారు రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి జగన్‌ అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లు నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్‌ తీరును జాతీయ టీవీ ఛానళ్లన్నీ ఎండగడుతున్నాయి. నిపుణులు, సామాజికవేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిబేట్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పౌరులు కూడా తమ అభిప్రాయాలను ఫోన్ల ద్వారా వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును జగన్‌ విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చుచేయడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. మరీ ఇంత లెక్కలేనితనమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాత్‌ టబ్, కమోడ్‌లు వంటి వాటికే రూ.లక్షల్లో ఖర్చు చేశారని వస్తున్న వార్తలు చూసి నివ్వెరపోతున్నారు. రుషికొండ ప్యాలెస్‌లను జాతీయ మీడియా... ‘శీష్‌ మహల్‌ ఆఫ్‌ ద సౌత్‌’గా అభివర్ణిస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన అధికారిక నివాసంలో మార్పులు చేర్పులకు రూ.44.78 కోట్లు వెచ్చించారని ఆరోపిస్తూ, భాజపా ఇటీవల తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది. కేజ్రీవాల్‌ ‘శీష్‌ మహల్‌’ నిర్మించుకున్నారని అక్కడ విమర్శలు వస్తుండగా... రుషికొండలోని ‘రాజమహళ్ల’ రహస్యం వెల్లడి కావడంతో కొన్ని ఛానళ్లు రెండింటినీ పోల్చుతూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రుషికొండపై కట్టిన భవనాలు జగన్‌ కోసమేనని జాతీయ మీడియా నిర్వహిస్తున్న చర్చల ద్వారా దేశం మొత్తానికి మరోసారి స్పష్టమైంది. జాతీయ మీడియా ఛానళ్ల చర్చల్లో పాల్గొంటున్న వైకాపా ప్రతినిధులు..వాటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారి కోసం నిర్మించామంటూ అడ్డగోలుగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖను రాజధానిని చేద్దామనుకున్నామని, అక్కడ విలాసవంతమైన భవనాలు లేకపోవడం వల్లే రుషికొండపై ప్యాలెస్‌లు కట్టామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.  

చీల్చిచెండాడుతున్న ఛానళ్లు..!

రిపబ్లికన్‌ టీవీ, ఎన్‌డీటీవీ, టైమ్స్‌నౌ, ఇండియాటుడే వంటి జాతీయ ఛానళ్లన్నీ రుషికొండ ప్యాలెస్‌లపై ప్రత్యేక కథనాలు, డిబేట్లు ప్రసారం చేస్తున్నాయి. ‘రూ.36 లక్షల ఖరీదైన బాత్‌టబ్‌ అవసరమా? షవర్‌తో స్నానం చేయలేరా? కావాలంటే పెద్ద షవర్‌ పెట్టుకోండి. రూ.36 లక్షల విలువైన బాత్‌టబ్‌లో చేస్తేనే స్నానమా? దాని వల్ల స్నానం నాణ్యత మారిపోతుందా’ అంటూ రిపబ్లికన్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామి వరుస ప్రశ్నలు సంధించారు. వైకాపా నాయకులు ఎన్ని విధాలుగా సమర్థించుకోవాలని చూసినా రూ.వందల కోట్లు వెచ్చించి ప్యాలెస్‌లు కట్టుకోవడం ముమ్మాటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘భూమి చదును చేయడానికి రూ.95 కోట్లు, లైటింగుకు రూ.36 కోట్లు, గ్రీనరీకి రూ.50 కోట్లు ఖర్చు పెడతారా? ఇదంతా ఎవరి డబ్బు’ అని నిలదీశారు. విశాఖకు వచ్చే ప్రముఖుల కోసం కట్టామని వైకాపా ప్రతినిధులు బుకాయించగా.. ‘ప్రముఖులంటే ఎవరు ముకేశ్‌ అంబానీనా, గౌతమ్‌ అదానీనా, కుమారమంగళం బిర్లానా’ అని ప్రశ్నించారు. జగన్‌ నివాసం ఉండటానికి రుషికొండపై రూ.500 కోట్లకుపైగా ప్రజాధనాన్ని వెచ్చించి ప్యాలెస్‌లు కట్టి, వాటిని పర్యాటకుల కోసం కట్టామని చెప్పడం నైతికంగా ఎంత వరకు సమర్థనీయమని టైమ్స్‌ నౌ ప్రతినిధి ప్రశ్నలు గుప్పించారు. విశాఖకు వచ్చే అతిథుల కోసమైతే... స్నానాల గదిలో స్పా అవసరమేంటని ప్రశ్నించారు. 

ప్రజా వేదిక ఖర్చు రూ.900 కోట్లట..!

వైకాపా నాయకులు, టీవీ డిబేట్లలో అడ్డగోలుగా సమర్థించేవారు.. రుషికొండపై జగన్‌ ప్రభుత్వ నిర్వాకం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. ‘సాక్షి’ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఒక ప్యానలిస్ట్‌...గతంలో చంద్రబాబు ప్రభుత్వం సమావేశాల నిర్వహణకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు కట్టిన ప్రజావేదిక నిర్మాణానికైన ఖర్చు రూ.900 కోట్లని అబద్ధాలు చెప్పారు. ప్రజావేదిక నిర్మాణానికి, దానిలో అమర్చిన టేబుళ్లు, కుర్చీలు, కమ్యూనికేషన్‌ పరికరాలు, ఏసీలు వంటి వాటన్నిటికీ అయిన ఖర్చు రూ.11 కోట్లు. దాన్ని జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసి, అక్కడి నుంచే తన విధ్వంసకర పాలన ప్రారంభించారు. 


హైదరాబాద్‌ లేకపోవడానికీ... రుషికొండ ప్యాలెస్‌కూ ఏమిటి సంబంధం?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ లేకుండా పోయిందట.. విలాసవంతమైన భవనాలన్నీ అక్కడ ఉండిపోయాయట.. అందుకే విశాఖలో రుషికొండపై జగన్‌ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలు కట్టిందట.. అవి రాష్ట్ర ప్రజలకు గర్వకారణమట..ఇదీ వైకాపా నాయకుల అడ్డగోలు సమర్థన..! రుషికొండపై కట్టింది పర్యాటకుల కోసం రిసార్టేనని, అయినా జగన్‌ అక్కడ నివాసం ఉంటే తప్పేంటని అప్పట్లో మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌ వంటివారు బుకాయించేవారు. ఇప్పుడు అదే అమర్నాథ్‌ వంటి నాయకులు నాలుక మడతేసి.. రుషికొండ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు విశాఖ వచ్చినప్పుడు వారు బస చేసేందుకు కట్టామని చెబుతున్నారు. జాతీయ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొంటున్న రవిచంద్రారెడ్డి వంటి వైకాపా ప్రతినిధులూ అదే వాదన వినిపిస్తున్నారు. అవి జగన్‌ సొంత భవనాలు కాదని, వాటిని ప్రజల కోసమే నిర్మించామని చెబుతున్నారు. ‘సామాన్య ప్రజలు ఎవరు వచ్చి రూ.36 లక్షల బాత్‌ టబ్‌లో  స్నానం చేయగలరు?’ అని అర్ణబ్‌ గోస్వామి అడిగిన ప్రశ్నకు మాత్రం నీళ్లు నమిలారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలు కూడా ఎండగడుతున్నారు. ధార్వాడ్‌ నుంచి ఫోన్‌ చేసిన ప్రశాంత్‌.. బాత్‌టబ్‌కు అన్ని లక్షల రూపాయలు పోసే బదులు, ఆ డబ్బును విద్యారంగాన్ని బాగు చేయడానికి వెచ్చించవచ్చు కదా అని నిలదీశారు.


సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్నారు..!

రుషికొండపై జగన్‌ కట్టిన ప్యాలెస్‌లపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. భారత పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి రూ.971 కోట్లు ఖర్చయితే.. రుషికొండ ప్యాలెస్‌లకు రూ.500 కోట్లకుపై వెచ్చించడమేంటని నిలదీస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల నిర్వహణకు సుమారు 1,200 మంది సభ్యులకు సరిపడేలా పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించారని, అది దేశం దశ-దిశ మార్చే చట్టాలు చేసే దేవస్థానమని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ‘రుషికొండ ప్యాలెస్‌ ఒక్కరి విలాసం కోసం, లేవగానే సముద్రాన్ని చూడటం కోసం, సముద్రం ఆ వ్యక్తి కాళ్ల కింద ఉండేలా చేసిన నిర్మాణం’ అని మండిపడుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు