వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష!

వైద్యశాస్త్రంలో యూజీ, పీజీ కోర్సులకు పరీక్షల నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారుతుండడం విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది.

Updated : 24 Jun 2024 07:15 IST

బోర్డు తీరుతో గాడితప్పిన వ్యవస్థ
నీట్‌ పీజీకి ఈ ఏడాది మూడు తేదీలు.. చివరికి వాయిదా 
కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం.. అభ్యర్థులకు ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యశాస్త్రంలో యూజీ, పీజీ కోర్సులకు పరీక్షల నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారుతుండడం విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. ఒకవైపు నీట్‌ యూజీపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. పీజీ పరీక్షను అకస్మాత్తుగా వాయిదా వేయడం విద్యార్థులను అయోమయంలో పడేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఎండీ, ఎంఎస్, మెడికల్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షను.. కొన్ని గంటల ముందు వాయిదా వేయడంతో వేలమంది విద్యార్థులు డీలా పడ్డారు. ఆదివారం నిర్వహించాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) శనివారం ప్రకటించడంతో అప్పటికే పరీక్షా కేంద్రాలున్న పట్టణాలకు చేరుకున్న విద్యార్థులు హతాశులయ్యారు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల్సి ఉండటంతో దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వేలమంది శనివారమే చేరుకున్నారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. అలాంటి వారందరికీ మరింత ప్రయాస తప్పలేదు. ఎంతో మంది తెలుగు విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాలకు ముందుగానే పయనమయ్యారు. కోచింగ్‌కు, ప్రయాణాలకు, వసతికి వేల రూపాయలు వెచ్చించినా వారికి నిరాశే మిగిలింది. 

మార్చి.. జులై.. జూన్‌..?

మార్చిలో జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్ష ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది. దీన్ని మొదట మార్చి ఒకటో తేదీన నిర్వహిస్తామన్నారు. కానీ దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌నే ఏప్రిల్‌లో ఇచ్చారు. జులై ఏడో తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌బీఈఎంఎస్‌ అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఆ దిశగా సన్నద్ధమవుతుండగా.. మళ్లీ పరీక్ష తేదీని జూన్‌ 23కు మార్చింది. ఎలాగోలా విద్యార్థులు పరీక్ష రాయడానికి సిద్ధమైతే.. వాయిదా నిర్ణయం వెలువడింది. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేదు. 

విద్యాసంవత్సరం అస్తవ్యస్తం 

లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్‌ పీజీ పరీక్ష ప్రక్రియ, తరగతులు.. కొవిడ్‌ కాలం నుంచి గందరగోళంగా మారాయి. సాధారణంగా పీజీ విద్యాసంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభం కావాలి. మార్చిలోపే పరీక్ష, ప్రవేశాలు పూర్తవ్వాలి. కొవిడ్‌ సమయంలో నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణ ఏడాదిపాటు ఆలస్యమైంది. తర్వాత కూడా పరీక్షను సకాలంలో నిర్వహించకపోవడంతో తరగతుల ప్రారంభం నవంబరు, డిసెంబరుకు చేరింది. కనీసం ఈ ఏడాది నుంచైనా సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తుండగా.. పరీక్ష నిర్వహణే గందరగోళంలో పడింది. ఎంబీబీఎస్, హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసుకున్న వారు.. పరిమితంగా ఉన్న పీజీ సీట్లు పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సిద్ధమవుతున్నా.. యంత్రాంగం తీరుతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.   

తీరా గదులు ఖాళీ చేసేశాక..

నీట్‌ - పీజీ కోసం వందల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. పరీక్ష తేదీ జూన్‌ 23 కావడంతో ఈ వారంలోనే చాలా మంది కోచింగ్‌ ముగించుకుని హాస్టళ్లను ఖాళీ చేసేశారు. పరీక్ష వాయిదా పడిందని మళ్లీ హాస్టళ్లలో చేరేందుకు ప్రయత్నిస్తుంటే ఖాళీలు లేని పరిస్థితి. పైగా అదనపు ఖర్చు తప్పదు.


ముందే చెప్పాల్సింది..
- సాయి శ్రీహర్ష, ప్రెసిడెంట్, తెలంగాణ జూడా అసోషియేషన్‌

ఎంతో కష్టపడి చదువుకుని సిద్ధమైనవారు పరీక్ష వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎందుకు వాయిదా వేశారో తెలియదు. పేపర్‌ లీకైందా? లేక వేరే కారణాలున్నాయా? ప్రకటించలేదు. వాయిదా వేయాలనుకుంటే కొన్ని రోజుల ముందే ఆ పని చేసి ఉండాల్సింది. అకస్మాత్తుగా ముందు రోజు ప్రకటించడం వేల మందిని అవస్థలకు గురిచేసింది. 


మా ఆశలపై నీళ్లు: వైద్యవిద్యార్థి 

‘మధ్యతరగతికి చెందిన నేను ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశాను. మెరిట్‌లో పీజీ సీటు సాధించేందుకు ఎంతో కష్టపడి చదువుతున్నా. కానీ నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణలో జాప్యం.. ఆర్థికంగా సమస్యగా మారింది. చివరకు వాయిదాతో నాలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కనీసం మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించకపోవడంతో అయోమయంలో పడ్డాం’ అని వైద్య విద్యార్థి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని