New District:ఉగాది నాటికి కొత్త జిల్లాలు

రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత

Updated : 27 Jan 2022 05:10 IST

ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌
2023 నాటికి పోలవరం పూర్తి
గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి పెరుగుతుందని గవర్నర్‌ వివరించారు. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడారు.

ఉద్యోగులకు మంచి పీఆర్సీ

‘రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటు, కొవిడ్‌ కారణంగా సొంత వనరులు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పీఆర్సీని ప్రకటించింది. 23% ఫిట్‌మెంట్‌ ప్రయోజనం కల్పించడంతోపాటు ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు, గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 27% ఐఆర్‌ మంజూరు చేసింది. ఆర్థిక సమస్యలున్నా 11వ వేతన సవరణ కమిషన్‌ను అమలు చేస్తున్నాం. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.10,247 కోట్ల ఆర్థిక భారం పడనుంది’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.  

32 నెలల్లో ప్రజలకు రూ.1,67,798 కోట్లు పంపిణీ

‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ), ప్రత్యక్షేతర ప్రయోజన బదిలీ విధానంలో 32 నెలల్లో రికార్డు స్థాయిలో 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్లు పంపిణీ చేశాం’ అని అన్నారు.
‘వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు ఇప్పటి వరకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. అమూల్‌ భాగస్వామ్యంతో రైతుకు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 అదనపు ఆదాయం వస్తోంది’ అని గవర్నర్‌ వివరించారు.

పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ‘నాడు- నేడు’

‘విద్య పథకాల కింద ఇప్పటి వరకు 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల లబ్ధి చేకూర్చాం. మన బడి నాడు-నేడు పథకంలో రూ.16,025 కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక కింద ఇప్పటివరకు రూ.45,837 కోట్లు సమకూర్చాం. విడతల వారీగా పెంచుతూ నెలకు రూ.3 వేల పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హరిచందన్‌ అన్నారు.

కొప్పర్తిలో మెగా పారిశ్రామిక హబ్‌

‘రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తి సమీపంలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధి చేయబోతున్నాం. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం వద్ద మూడు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వ్యయం చేయాలని భావిస్తోంది’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది పోలవరం పూర్తి!

‘పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి   చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. వెలిగొండ టన్నెల్‌-1ను 2022 ఖరీఫ్‌కు ప్రారంభిస్తాం. ప్రభుత్వం తాగు, సాగునీటి కోసం రూ.74,920 కోట్లతో ప్రాధాన్యక్రమంలో 54 ప్రాజెక్టులను చేపడుతోంది’  అని గవర్నర్‌ వెల్లడించారు.


ప్రజలే ప్రభుత్వం.. అదే రాజ్యాంగ సిద్ధాంతం
ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు.. ఈ సిద్ధాంతంపైనే భారత  రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం ట్వీట్‌ చేశారు. ఈ మహోన్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన దార్శనికులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు అని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రధాన భద్రతాధికారి కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని