Amaravati: అమరావతి ‘లైన్‌’ కదిలింది!.. ప్రభుత్వం మారడంతో రైల్వే శాఖ ఉరుకులు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం గడిచిందో లేదో.. రైల్వేశాఖ ఆఘమేఘాలపై దిగొచ్చింది.

Updated : 21 Jun 2024 17:17 IST

ఐదేళ్ల పాటు పట్టించుకోని వైకాపా సర్కారు
ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు గుర్తింపు
56.53 కి.మీ. కొత్తలైన్‌.. భూసేకరణకు ఏర్పాట్లు
రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం గడిచిందో లేదో.. రైల్వేశాఖ ఆఘమేఘాలపై దిగొచ్చింది. ఉరుకులు పరుగులతో అమరావతి రైల్వే లైన్‌ భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఏ సంస్థలైనా ముందుకొచ్చి  పనిచేసేందుకు క్యూ కడతాయి అనేందుకు ఇదే ఉదాహరణ. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లపాటు ఉలుకు పలుకు లేకుండా ఉన్న రైల్వేశాఖ.. చంద్రబాబు సీఎం కావడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై దృష్టిపెట్టడంతో.. వెంటనే అక్కడి కొత్త రైల్వేలైన్‌కు క్లియరెన్స్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే ఇప్పుడవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.  

56.53 కి.మీ.కు 450 హెక్టార్ల భూసేకరణ 

ఇటు విజయవాడ, అటు గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా కొత్త రైల్వే లైన్‌ 2017-18లో మంజూరైంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్‌ లైన్, అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5కి.మీ. సింగిల్‌ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కి.మీ. సింగిల్‌ లైన్‌ కలిపి మొత్తం 106 కి.మీ. మేర కొత్తలైన్‌కు ఆమోదం లభించింది. అయితే 2019లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టుపై పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. దీంతో ఇది పూర్తిగా మరుగున పడిపోయింది. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో రైల్వేశాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్‌ లైన్‌ బదులుగా మొదట సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి, భూసేకరణకు కలిపి రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.  

9 కొత్త రైల్వే స్టేషన్లు.. 

ఈ కొత్త లైన్‌ విజయవాడ-హైదరాబాద్‌ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద మొదలై, అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో 9 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్దస్టేషన్ల్లుగా నిర్మిస్తారు. వాటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. పరిటాల స్టేషన్‌ వద్ద ఎక్కువ గూడ్స్‌ రైళ్లు నిలిచేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ లైన్‌లో భాగంగా కృష్ణా నదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కి.మీ. వంతెన నిర్మిస్తారు.

ప్రాజెక్టును పాడుబెట్టిన జగన్‌ 

రాజధాని అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేసిన జగన్‌ ప్రభుత్వం.. రాజధానిలో అన్ని ప్రాజెక్టులను పాడుబెట్టింది. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పేర్చకుండా గడిపేసింది. ఏడేళ్ల కిందట అమరావతి రైల్వేలైన్‌ను కేంద్రం మంజూరు చేసినా వైకాపా ప్రభుత్వ వ్యవహారం కారణంగా అందులో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్రం కూడా పట్టించుకోలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని