Amaravati: అమరావతిలో ఎన్‌హెచ్‌ కార్యాలయం మూత

రాజధాని అమరావతికి కీలకమైన ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపితే.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది.

Updated : 11 Jul 2024 07:36 IST

విజయవాడ యూనిట్‌లో విలీనం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి కీలకమైన ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపితే.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. అమరావతి కేంద్రంగా ఇంతకాలం ఉన్న ప్రాజెక్టు అమలు యూనిట్‌ (ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంట్‌ యూనిట్‌ - పీఐయూ)ను మూసివేసింది. దీన్ని విజయవాడ పీఐయూలో విలీనం చేసింది. 2014లో రాజధానిగా అమరావతి ఖరారయ్యాక.. 189 కి.మీ. అవుటర్‌ రింగ్‌ రోడ్‌కు నాడు చంద్రబాబు ప్రతిపాదించారు. దాన్ని కేంద్రం ఆమోదించి, ఎలైన్‌మెంట్‌ ఖరారు చేసింది. డీపీఆర్‌ల రూపకల్పన తదితరాలన్నీ వేగంగా జరిగేలా అమరావతి కేంద్రంగా ప్రాజెక్టు యూనిట్‌ కార్యాలయాన్ని మంజూరు చేశారు. మంగళగిరిలో దాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం నుంచి అమరావతికి నిర్మించ తలపెట్టిన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్‌ల రూపకల్పన కూడా ఇదే యూనిట్‌కి అప్పగించారు. దీనికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను కూడా నియమించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓఆర్‌ఆర్, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిగా పక్కనపెట్టింది. దీంతో అమరావతి యూనిట్‌కు ఇతర పనులు అప్పగించారు. తాజాగా ఈ నెల 1వ తేదీ నుంచి ఈ యూనిట్‌ను మూసేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో మంగళగిరిలో ఉన్న కార్యాలయాన్ని మూసేశారు.

కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కేదెలా?: తాజాగా అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణానికీ సరేనంది. కొత్తగా ముప్పవరం నుంచి నేరుగా అమరావతికి చేరుకునేందుకు ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్‌ నుంచి అమరావతికి కొత్తగా మరో ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇన్ని ప్రాజెక్టులకు సకాలంలో ఎలైన్‌మెంట్ల ఖరారు, డీపీఆర్‌ల తయారీ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియతో పాటు వేగంగా పనులు జరిగేలా చూడాలంటే ప్రత్యేకంగా ఎన్‌హెచ్‌ఏఐ యూనిట్‌ కార్యాలయం ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఎన్‌హెచ్‌ఏఐ అవేమీ పట్టించుకోకుండా అమరావతి యూనిట్‌ను లేకుండా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని