Tamilnadu: విద్వేషాలు విడిచి వైవిధ్యంగా నడిచి.. తమిళనాట రాజకీయ కక్షలకు చెల్లు

ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలంటే ప్రత్యర్థులపై ప్రతీకారాలకు పెట్టింది పేరు. డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఒకరింటికి మరొకరు శుభకార్యాలకు కూడా వెళ్లరని ప్రతీతి.  డీఎంకే నుంచి కరుణానిధి, అన్నాడీఎంకే

Updated : 23 Sep 2022 10:20 IST

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితి..

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-చెన్నై: ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలంటే ప్రత్యర్థులపై ప్రతీకారాలకు పెట్టింది పేరు. డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఒకరింటికి మరొకరు శుభకార్యాలకు కూడా వెళ్లరని ప్రతీతి.

డీఎంకే నుంచి కరుణానిధి, అన్నాడీఎంకే నుంచి జయలలిత.. ఇద్దరిలో ఎవరు సీఎం అయినా.. ప్రతిపక్షంపై ప్రతీకార రాజకీయాలు చేసేవారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సాక్షాత్తు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానం, ఆ తర్వాత జయ అధికారంలోకి రాగానే అర్ధరాత్రి కరుణానిధిని అరెస్టు చేసి తీసుకువెళ్లిన తీరు అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.

ఇవన్నీ ఒకప్పటి మాటలు.. గతేడాది డీఎంకే అధికారంలోకి వచ్చి స్టాలిన్‌ సీఎం అయ్యాక.. ఈ వైఖరిని మార్చేశారు. రాజకీయాలు, పరిపాలనను వేరు చూస్తూ స్టాలిన్‌ తీసుకొచ్చిన సరికొత్త మార్పులు ప్రశంసలు పొందుతున్నాయి. విద్వేష రాజకీయాలు, గత ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడం, నిధుల్ని దుబారా చేయడం వంటివి ఆయన పూర్తిగా పక్కనపెట్టారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నపుడు తెచ్చిన పథకాల్ని దాదాపుగా కొనసాగించడంతోపాటు వాటి పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి విరుద్ధంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలోని పథకాల్లో కొన్నింటిని రద్దు చేయగా చాలావాటికి పేర్లు మార్చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పూర్తిగా మూతపెట్టారు. తాజాగా.. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తీసేసి వైఎస్‌ పేరు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. దీంతో సహజంగానే పొరుగు రాష్ట్రంలోని పరిస్థితి గురించి తెలుసుకోవడం ఆసక్తికరం.. ఆ వివరాలివి..

జయ బొమ్మతోనే స్కూల్‌ బ్యాగులు 

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందుకు అన్నాడీఎంకే హయాంలో పాఠశాల విద్యార్థుల బ్యాగులపై మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అప్పటి సీఎం ఎడప్పాడి పళనిస్వామి బొమ్మలు ముద్రించారు. డీఎంకే వచ్చాక వారి చిత్రాలతో మిగిలి ఉన్న 65 లక్షల బ్యాగుల్ని పక్కన పారేయడకుండా విద్యార్థులకు పంపిణీ చేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 13 కోట్లు ఆదా అయింది.

అమ్మ క్యాంటీన్లకు ఆదరణ.. 

జయలలిత హయాంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. పేదలకు తక్కువ ధరలతో ఆహారం అందించే ఈ కేంద్రాల్ని స్టాలిన్‌ ప్రభుత్వం రద్దు చేయకుండా.. వాటిని అదే పేరుతో మరింత మెరుగ్గా కొనసాగిస్తుండడం ప్రశంసలు కురిపిస్తోంది. అలాగే జయలలిత 2001-06 మధ్య కాలంలో ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని డీఎంకే ప్రభుత్వం మరిన్ని ఆలయాలకు విస్తరించింది. ఈ పథకం ప్రస్తుతం 756 ఆలయాల్లో అందుబాటులో ఉంది.

ఆసుపత్రుల్లో అమ్మ చిత్రాలే నేటికీ..

జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు స్టాలిన్‌ పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఇప్పటికీ జయలలిత ఫొటోలు, పోస్టర్లు ఉన్నాయి. తాజాగా చెన్నైలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌ ముగింపు కార్యక్రమంలో జయలలిత మహిళా సాధికారతకు చేసిన కృషి గురించి ప్రస్తావించారు. ప్రతిపక్షాలు సైతం ఈ చర్యను ప్రశంసించాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts