NV Ramana:పులకించిన పొన్నవరం

బాజాభజంత్రీలు.. వేదాశీర్వచనాలు.. కోలాటాలు.. ఎడ్లబండిపై ఎదుర్కోలు.. రహదారికి ఇరువైపులా జాతీయపతాకాలు చేతబూనిన విద్యార్థ్ధులు, యువత మహిళలు.. గ్రామగ్రామాన స్వాగత తోరణాలు.. సుప్రీంకోర్టు ప్రధాన

Updated : 25 Dec 2021 04:14 IST

సీజేఐకి అపూర్వ స్వాగతం
రాష్ట్ర సరిహద్దు నుంచి నీరాజనాలు
స్వగ్రామంలో ఎడ్లబండిపై ఎదుర్కోలు
సొంతూరిలో బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, అమరావతి : బాజాభజంత్రీలు.. వేదాశీర్వచనాలు.. కోలాటాలు.. ఎడ్లబండిపై ఎదుర్కోలు.. రహదారికి ఇరువైపులా జాతీయపతాకాలు చేతబూనిన విద్యార్థ్ధులు, యువత మహిళలు.. గ్రామగ్రామాన స్వాగత తోరణాలు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాక తొలిసారిగా స్వగ్రామం పొన్నవరం వచ్చిన జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు లభించిన ఘనస్వాగతమిది. రాష్ట్ర సరిహద్దు నుంచే ఆయనకు జనం నీరాజనాలు పట్టారు. పౌరుల మధ్యే ఆయన సన్మానాలు స్వీకరించారు. వేదికపై కాకుండా గ్రామస్థులు, ప్రముఖుల దగ్గరకు వెళ్లి సత్కారం అందుకున్నారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. స్వీయ చిత్రాలు దిగారు. సొంతూరు పొన్నవరం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం సీజేఐను ఘనంగా సత్కరించారు.

శుక్రవారం ఉదయం 10.45 గంటలకు రాష్ట్ర సరిహద్దు కృష్ణా జిల్లా గరికపాడు వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులకు ఘనస్వాగతం లభించింది. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు, లా సెక్రటరీ సునీత, నందిగామ అదనపు డిస్ట్రిక్ట్‌ జడ్జి బి.శ్రీనివాస్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆయనకు స్వాగతం పలికారు. గరికపాడు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయన్ను స్వాగతిస్తూ నినాదాలు చేశారు. సీజేఐ దంపతులు అక్కడివారి సత్కారం స్వీకరించారు. అనంతరం చిల్లకల్లు, గౌరవరం, కొనకొంచి, నవాబుపేట బైపాస్‌, మునగచర్ల, అంబారుపేట, ఐతవరం గ్రామాల్లోనూ బారులు తీరి స్వాగతం పలికిన గ్రామస్థులను పలకరించారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు వెల్‌కం సీజేఐ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12.45కి పెరికలపాడు క్రాస్‌రోడ్డుకు చేరుకునేసరికి పెద్దఎత్తున ప్రజలు గుమికూడారు. అక్కడే విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ స్వాగతం పలికారు. పొన్నవరం గ్రామ ముఖద్వారం వద్ద గ్రామస్థులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులను అందంగా అలంకరించిన ఎడ్లబండిపై ఎక్కించి.. బాజాభజంత్రీలు, మహిళల కోలాటాల సందడి మధ్య సగౌరవంగా గ్రామంలోకి తోడ్కొని వచ్చారు. తొలుత గ్రామంలోని శివాలయంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు పూజలు చేశారు. అనంతరం తన సోదరుడు నూతలపాటి వీరనారాయణ నివాసానికి వెళ్లి బంధుమిత్రులను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కలిశారు. పలువురు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా సీజేఐతో భేటీ అయ్యారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నివాసం నుంచి నడుచుకుంటూ.. మధ్యాహ్నం 1.30 గంటలకు పౌరసన్మాన వేదిక వద్దకు చేరుకున్నారు. విజయవాడకు చెందిన కళాకారుల బృందం భరతనాట్యంతో ఆయనకు స్వాగతం పలికారు. వేదికపై సన్మానాలు వద్దంటూ వారించిన సీజేఐ కిందకు వచ్చి న్యాయమూర్తులు, అధికారులు, ప్రముఖులను పరిచయం చేసుకుంటూ వారి సత్కారాలను స్వీకరించారు. 40 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది.


బంధువులతో కలిసి విందు

స్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం మధ్యాహ్నం సోదరుడు నూతలపాటి వీరనారాయణ నివాసంలో బంధువులతో కలిసి మధ్నాహ్నం భోజనం చేశారు. అతి కొద్దిమంది సన్నిహితులను మాత్రమే అక్కడ కలిసి, సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి విజయవాడ వచ్చారు. సీజేఐ రాక సందర్భంగా గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.  


పెదనందిపాడులో ఆతిథ్యం

ఆత్మీయ స్వాగతం పలికి, విందు ఇచ్చిన జస్టిస్ లావు నాగేశ్వరరావు

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గ్రామస్థులు, జిల్లా యంత్రాంగం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి 10.48 గంటలకు తమ నివాసానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆయన కుటుంబీకులను ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్జిస్‌ సతీష్‌చంద్ర శర్మ దంపతులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజేష్‌ గోయల్‌, సూర్యదేవర ప్రసన్నకుమార్‌, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు, రిజిస్ట్రార్‌ లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ పి.శ్రీధర్‌రావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ లావు రత్తయ్య తదితరులు హాజరయ్యారు. పరిచయాలు, పలకరింపుల అనంతరం విందు జరిగింది. అనంతరం సీజేఐ విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. స్వాగత ఏర్పాట్లు, అధికార యంత్రాంగం రాకపోకలతో ఉదయం నుంచే పెదనందిపాడులో సందడి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని