NV Ramana:తెలుగు జాతి ప్రతిష్ఠ నిలబెడతా

తెలుగుజాతి గౌరవ, ప్రతిష్ఠలు ఇనుమడించేలా వ్యవహరిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. దిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అన్నట్లు.. తాను ప్రధాన న్యాయమూర్తినయినా పొన్నవరం బిడ్డనేనని చెప్పారు. తాను దిల్లీలో సమావేశాలకు వెళితే..

Updated : 25 Dec 2021 09:50 IST

ప్రధాన న్యాయమూర్తినయినా.. పొన్నవరం బిడ్డనే
పౌరసన్మానంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
రాష్ట్ర సరిహద్దులో ఆయనకు అపూర్వ స్వాగతం
అక్కడి నుంచి స్వగ్రామం వరకు ప్రజల బ్రహ్మరథం

తెలుగువారు ఎంతోమంది వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నా తెలుగు జాతికి సరైన గుర్తింపు లేదనే వేదన నాలో ఉంది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి.

పొన్నవరం గ్రామస్థులు నా తల్లిదండ్రుల్లాంటివారు. మీ అందరి ముందు పుట్టి పెరిగాను. మీ ఆదరాభిమానాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. మీ ఆశీర్వచనాల కోసం వచ్చాను.      

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, అమరావతి: తెలుగుజాతి గౌరవ, ప్రతిష్ఠలు ఇనుమడించేలా వ్యవహరిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. దిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అన్నట్లు.. తాను ప్రధాన న్యాయమూర్తినయినా పొన్నవరం బిడ్డనేనని చెప్పారు. తాను దిల్లీలో సమావేశాలకు వెళితే.. తెలుగువారి గురించి పలువురు ప్రస్తావిస్తుంటారని చెప్పారు.

విభిన్న రంగాల్లో ఎంతోమంది తెలుగు జాతి ఘనతను చాటిచెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తొలిసారి శుక్రవారం తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటు చేసిన పౌరసన్మాన సభలో ఆయన ప్రసంగించారు. తాను ప్రసంగాలు, సన్మానాల కంటే పరిచయస్తులను కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అన్నారు. గ్రామాన్ని వదిలిపెట్టి చాలాకాలమైనా.. నా మూలాలు ఇక్కడే ఉన్న విషయం ఏనాడూ మరవలేదు. పొన్నవరం గ్రామస్థుల ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. మా తాత సేవాభావం, నాన్న అభ్యుదయభావాలు నాకు అబ్బాయి. అక్క, పెద్దమ్మ, పెదనాన్న నన్ను పెంచారు. అయిదుగురు తోబుట్టువులతో కలిసి పెరిగాను. రాజు మాస్టారి వీధి బడిలో చదివాను. ఇప్పటిలా ఏసీలు కాదు కదా ఫ్యాన్లు కూడా లేవు. అరుగుమీద బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పేవారు. ఏనాడూ ఆయన చేతిలో దెబ్బలు తిన్నట్లు గుర్తులేదు. బహుశా సన్నగా, పీలగా ఉండటం వల్ల నన్ను కొట్టకపోయి ఉండవచ్చు’ అంటూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు
‘నందిగామ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. నాడు మూడు పార్టీలు ఉండేవి. ఎన్ని పార్టీలున్నా ఘర్షణలు జరిగేవి కావు. రాజకీయాలు ఎన్నికల వరకే. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడూ అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నా. మా నాన్న గణపతిరావు కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. ఒకసారి ఆయన తమ మద్దతుదారులతో సమావేశమయ్యారు. నేను స్వతంత్ర పార్టీ జెండాతో కమ్యూనిస్టు పార్టీ డౌన్‌డౌన్‌ అని నినాదాలు చేశాను’ అని వివరించారు. ‘నాకు శివలింగప్రసాద్‌ అని బాల్యమిత్రుడు ఉండేవారు. ఇటీవల కాలం చేశారు. చింతమనేని సత్యవతమ్మ ఉండేవారు. ఆమె భర్త రంగా గారి శిష్యుడు. కంచికచర్లలో రంగా గారి సభ జరుగుతుంటే ఆమె వెళ్లమని ప్రోత్సహించారు. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడింది’ అని చెప్పారు.

రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అత్యున్నత పదవిని అలంకరించడం అరుదైన విషయమని కొనియాడారు. దేశానికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేలు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణప్రసాద్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ లలిత, జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దేవానంద్‌, మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌, గ్రామ సర్పంచి రాజశ్రీ హాజరయ్యారు. గ్రామస్థులు, అధికారులు, పలువురు ప్రముఖులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణను ఘనంగా సన్మానించారు.


సమస్యలపై సమష్టిగా పోరాడాలి

‘నందిగామ మెట్టప్రాంతం. అంతా దుర్భిక్షం. నీళ్లు దొరికేవి కావు. గ్రామాల్లో ఏదడిగినా ఇచ్చేవారు కానీ నీళ్లిచ్చేవారు కాదు. నాడు మా తాతగారు తవ్విన బావి..  బాపయ్య కుంట ఇప్పటికీ ప్రసిద్ధి. తర్వాత సాగర్‌ కాలువ వచ్చినా దుర్భిక్షం తగ్గలేదు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర దక్కడం లేదు. భూసమస్యలు ఉన్నాయి. నందిగామ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదనే ఆవేదన నాలో ఉంది. దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతున్నాయి. సమస్యలూ అదే స్థాయిలో ఉన్నాయి. సమస్యలపై సమష్టిగా పోరాడాలి’ అని సీజేఐ సూచించారు. ‘ఎంతోమంది తెలుగు జాతి ఘనతను చాటి చెప్పారు. టెర్రరిస్టుల అరాచకాల మధ్య అఫ్గానిస్తాన్‌ పార్లమెంటు భవనం నిర్మించింది తెలుగువారే. ఇక్కడి నిర్మాణ సంస్థలు దేశవిదేశాల్లో ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేశాయి. కరోనా సమయంలో టీకాను అభివృధ్ధి చేసిన భారత్‌ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల తెలుగువారు కావడం గర్వకారణం’ అన్నారు. ‘గ్రామానికి రావాలని మా సోదరుడు వీరనారాయణ కొన్ని రోజులుగా కోరుతున్నారు. అందుకే వచ్చాను. నాకు అపూర్వ స్వాగత, సత్కారాలు ఏర్పాటు చేసిన గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు’ అంటూ ముగించారు.


దిల్లీలో ఆయన ఇంటిముందు తెలుగులోనే పేరు

న్మాన సభకు అధ్యక్షత వహించిన మాజీ ఉపసభాపతి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ సీజేఐతో తనకు భాషా సంబంధం ఉందన్నారు. ఆయన మాతృభాషాభిమాని అంటూ కొనియాడారు. దిల్లీలో ఆయన భవనం ముందు తెలుగులో నామఫలకం ఉంటుందన్నారు. భారతావనికి ఆణిముత్యాన్ని అందించిన పొన్నవరాన్ని ప్రశంసించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని