Omicron:ఒమిక్రాన్‌ కలకలం!

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు రాష్ట్రంలోనూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు ఒమిక్రాన్‌ కేసులుండగా తాజాగా మరో 10 వెలుగుచూశాయి. వీరిలో

Updated : 30 Dec 2021 10:09 IST

రాష్ట్రంలో మరో 10 కేసులు వెలుగులోకి..

ఇందులో బాధితులతో సన్నిహితంగా మెలిగినవారు ముగ్గురు

10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్‌ డోస్‌

ఈనాడు - అమరావతి

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు రాష్ట్రంలోనూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు ఒమిక్రాన్‌ కేసులుండగా తాజాగా మరో 10 వెలుగుచూశాయి. వీరిలో బాధితులతో సన్నిహితంగా మెలిగినవారు ముగ్గురు, అందులో 17 ఏళ్ల బాలిక ఉండటం గమనార్హం. బాధితులు ఈ నెల 14 నుంచి 21 మధ్య అమెరికా, కువైట్‌, నైజీరియా, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి రాష్ట్రానికి వచ్చారని.. వీరంతా 50ఏళ్లలోపు వయసువారేనని వైద్య, ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడినా ఎక్కడా వారి నుంచి వేరేవారికి సోకినట్లు (కాంటాక్ట్‌ కేసులు) దాఖలాల్లేవు. అయితే తాజాగా వచ్చిన 10 కేసుల్లో మూడు కాంటాక్టు కేసులే కావడం ఒమిక్రాన్‌ వ్యాప్తిని స్పష్టం చేస్తోందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. తాజా కేసులతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కి చేరింది.

ఆరు జిల్లాల్లో 10 కేసులు

రాష్ట్రంలో తాజాగా ఆరు జిల్లాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో మూడు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వచ్చాయని ప్రజారోగ్యశాఖ సంచాలకులు హైమావతి ఓ ప్రకటనలో తెలిపారు. ‘తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకింది. కర్నూలులో భార్యాభర్తలిద్దరూ దీని బారినపడ్డారు. కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్‌ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో పాజిటివ్‌గా వచ్చిన నమూనాలను జన్యుక్రమ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపాం’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 81 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరి ద్వారా మరో 14 మందికి కొవిడ్‌ సోకింది.

వ్యాప్తిని బట్టి చర్యలు

రానున్న రోజుల్లో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి అనుగుణంగా కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేయాలని భావిస్తున్నారు. జిల్లాల్లో 5 శాతం కేసులు నమోదైతే జాగ్రత్తలు, పది శాతం నమోదైతే.. కంటైన్‌మెంట్‌, ఇతర కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదయ్యే కేసులు తక్కువగానే ఉన్నాయి. కేసుల సంఖ్యను బట్టి కొవిడ్‌ ఆంక్షలు కఠినతరం చేస్తారు. ఆసుపత్రులను అధికారులు సిద్ధం చేస్తున్నారు.


9 నెలలు దాటితేనే బూస్టర్‌

రాష్ట్రంలో 60 ఏళ్లు దాటినవారు 29 లక్షలు, ఆరోగ్య సిబ్బంది 4.89 లక్షల మంది చొప్పున ఉన్నారు. వీరితోపాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాల (బూస్టర్‌ డోసు) పంపిణీని వచ్చే నెల 10న ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో రెండు డోసుల టీకా పొంది 9 నెలలు (39 వారాలు) గడిచిన వారికి మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. 60 ఏళ్లు వయసుండి, దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు టీకా పొందాలనుకున్న రోజున వైద్యుల సలహా తీసుకొని, టీకా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాల్లో వీరందరికీ ఉచితంగా టీకా ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిషీల్డ్‌ 38.81 లక్షలు, కొవాగ్జిన్‌ 7.63 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఈ నెలాఖరులోగా కొవిషీల్డ్‌ను రెండో డోసుగా పొందాల్సినవారు 26 లక్షలు, కొవాగ్జిన్‌ పొందాల్సినవారు 4.36 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు.


బాలబాలికలకు 3 నుంచి తొలి డోసు

రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు కరోనా టీకా తొలి డోసు పంపిణీ వచ్చే నెల 3న ప్రారంభం కానుంది. ఈ వయసువారు రాష్ట్రంలో 24.41 లక్షల మంది ఉన్నారు. వీరికి కొవాగ్జిన్‌ టీకా వేస్తారు. ఒకటో తేదీ నుంచి కొవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. మూడో తేదీ నుంచి నేరుగా వెళ్లి వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని