Andhra News: వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు

ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు.

Published : 07 Jul 2024 10:11 IST

వైకాపా హయాంలో షాడో ఎమ్మెల్యేగా గుర్తింపు
రూ.కోట్లు ఆర్జించిన కంటి విభాగం ఉద్యోగి

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. కార్యాలయ విధులు పక్కనపెట్టి ఓ నిర్మాణసంస్థను స్థాపించి, బినామీలతో నడిపిస్తూ గుత్తేదారు అవతారమెత్తారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు, పాణ్యం మండలాలను శాసించిన ఆ ఉద్యోగి మాజీ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. ఇప్పటికీ అదే దందా సాగిస్తున్న ఈ ఆఫ్తల్మాలజీ సీనియర్‌ అసిస్టెంట్‌ లీలలను ప్రభుత్వం విచారిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశముంది.

నంద్యాల జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆఫ్తల్మాలజీ ఉద్యోగి 2014లో కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రికి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఐదేళ్ల తర్వాత మాతృ కార్యాలయానికి వెళ్లకపోగా, కర్నూలులోనే ఉంటూ కాంట్రాక్టరుగా మారిపోయారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఏనాడూ సరిగ్గా విధులు నిర్వర్తించిన దాఖలా లేదు. హాజరు పట్టికలో మాత్రం సంతకాలు చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లేని సమయంలో ఆడిందే ఆటగా నడిచింది. అప్పట్లో కంటి ఆసుపత్రి ఉన్నతాధికారి, ప్రస్తుత అంధత్వ నివారణ సంస్థ ఉన్నతాధికారి సైతం ఇతని అక్రమాలను ప్రశ్నించలేదు. కర్నూలు నుంచి నంద్యాల జిల్లా విడిపోయి రెండేళ్లవుతున్నా, అతని డిప్యుటేషన్‌ రద్దు కాలేదు. ఓ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువైన ఆయన షాడో ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో వైకాపా తరఫున అన్నీ తానై వ్యవహరించారు. నగదు పంపిణీ, ప్రచారం తదితర వ్యవహారాలన్నీ చక్కదిద్దారు. కర్నూలు నగర శివారులోని వక్ఫ్‌బోర్డు స్థలం ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నా నగరపాలక సంస్థ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. 

రూ.కోట్ల విలువైన పనులు చేస్తూ..

  • ఓ పరిశ్రమ కోసం ఓర్వకల్లు ప్రాంతంలో రూ.100 కోట్లతో చేపట్టిన పనులు ఈ ఉద్యోగి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించి రోడ్లు నిర్మిస్తున్నారు. శకునాల, గని ప్రాంతాల్లో ఓ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ పలు నిర్మాణ పనులు చేస్తోంది. ఈ ఉద్యోగే వీటిని తన బినామీలతో చేయిస్తున్నారు.
  • గనిలో రూ.25 కోట్లతో అప్రోచ్‌ కెనాల్, చెరువులో పూడికతీతకు పనులు చేపట్టగా, వాటికి గుత్తేదారు ఈ ఉద్యోగేనని ప్రచారంలో ఉంది.
  • బ్రాహ్మణపల్లెలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నిరుద్యోగులకు స్థలాలు కేటాయించారు. అక్కడ రోడ్ల నిర్మాణపనుల కాంట్రాక్టు ఇతని సంస్థకే దక్కింది. అన్నీ నాసిరకంగా చేశారన్న ఆరోపణలున్నాయి.
  • ఓర్వకల్లు, పిన్నాపురంలో వివిధ పనులను తన బినామీలతో చేయిస్తున్నారు. 
  • పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద సుమారు రూ.1.96 కోట్ల విలువైన పనులు చేయించారు. ఇవన్నీ నాసిరకంగా జరిగాయన్న విమర్శలున్నాయి. మొత్తంగా వైకాపా ఐదేళ్ల పాలనలో రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని