Pawan Kalyan: అంతర్జాతీయ స్థాయిలో జూ పార్కుల అభివృద్ధి

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతు ప్రదర్శనశాలల్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 11 Jul 2024 04:43 IST

అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశం
‘టీ విత్‌ డిప్యూటీ సీఎం’ కార్యక్రమాన్ని రూపొందించండి
అరుదైన జంతువుల దిగుమతిపై దృష్టి పెట్టాలని సూచన

ఈనాడు డిజిటల్, అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతు ప్రదర్శనశాలల్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చుకోవడం, అరుదైన జంతువుల్ని దిగుమతి చేసుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు. బుధవారం మంగళగిరిలోని ఆయన నివాసంలో ఛైర్మన్‌ హోదాలో జూ పార్క్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ గవర్నింగ్‌ బాడీ 14వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ, తిరుపతిల్లోని జంతు ప్రదర్శనశాలలకు ఎక్కువమంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్‌ సంస్థల్ని భాగస్వాముల్ని చేసి, సీఎస్‌ఆర్‌ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ దిశగా నేను విశాఖ, తిరుపతిల్లో పర్యటించేటప్పుడు ‘టీ విత్‌ డిప్యూటీ సీఎం’ తరహా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకున్న అవకాశాల్ని పరిశీలించి, జోన్ల వారీగా నివేదిక రూపొందించాలి’ అని ఆదేశించారు. 

పీసీబీని ప్రజలకు చేరువ చేయాలి

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ మాట్లాడుతూ.. ‘పీసీబీని ప్రజలకు చేరువ చేయాలి. నేరుగా కార్యాలయాలకు వచ్చి సమస్యలపై ఫిర్యాదులు చేసేలా ఉండాలి. అందుకోసం రోజూ రెండు గంటల సమయం కేటాయించాలి. మండలి వెబ్‌సైట్లో రాష్ట్రంలోని వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదుల స్వీకరణకు సమయం కేటాయిస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి బి.శ్రీధర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని