Andhra News: చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?

కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 05 Jul 2024 06:50 IST

వైకాపా పాలన అక్రమాల ఆధారాల్ని మాయం చేసేందుకే పీసీబీ పత్రాల దహనం!
అన్ని వేళ్లూ నాటి మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ, ఓఎస్డీ రామారావు వైపే
రాత్రి వేళ తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు

దస్త్రాలు తరలించిన ఇన్నోవా కారు

ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్‌ అమరావతి, మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ నాటి అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవలి వరకూ పీసీబీ ఛైర్మన్‌గా పనిచేసిన సమీర్‌ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావు వైపే చూపిస్తున్నాయి. పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు బస్తాల కొద్దీ బయటకు ఎలా వచ్చాయి? ఎవరి ఆదేశాల మేరకు వాటిని బయటకు తీసుకొచ్చారు? రాత్రి 10 గంటల తర్వాత, ఊరు చివర కృష్ణా నది కరకట్టపై ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే ఎందుకు పారిపోయారు? తదితర ప్రశ్నలు అనేక అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. జగన్‌ జమానాలో ఇసుక, మైనింగ్‌లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి అటవీ, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు సహా ఇతర అంశాల్లో పీసీబీ అధికారులు కొందరు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపా హయాంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమలపై కక్ష కట్టి    వేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆధారాలు ధ్వంసం చేసేందుకే పత్రాల్ని తగలబెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సమీర్‌ శర్మకు తెలియదా?

గత ప్రభుత్వ హయాంలో సమీర్‌ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన వెంటనే.. జగన్‌... ఆయన్ను పీసీబీ ఛైర్మన్‌గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు ఐఏఎస్‌ అధికారిగా, రాష్ట్రానికి సీఎస్‌గా పనిచేసి, ఇన్నాళ్లూ కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతల్లో కొనసాగిన సమీర్‌ శర్మకు దస్త్రాల్ని, పత్రాల్ని కాల్చకూడదని తెలియదా? ఆ పత్రాలు నిరుపయోగమైనవైతే నిబంధనల ప్రకారం కటింగ్‌ మిషన్‌లో పెట్టి చిత్తుగా మార్చాలి. 

సుదీర్ఘకాలం పాటు ఎక్సైజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించి 2021 జూన్‌లో రామారావు పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన సమీర్‌ శర్మ వద్ద ఓఎస్డీగా చేరారు. ఎక్సైజ్‌ శాఖలో పనిచేసినప్పుడు బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అనేక ఇతర అంశాలకు సంబంధించి రామారావుపై ఫిర్యాదులున్నాయి. ఆయన అత్యంత వివాదాస్పదుడు. ఈ పత్రాల దహనంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. 


దస్త్రాలు దహనమైన చోట ఆధారాలు సేకరిస్తున్న పెనమలూరు సీఐ రామారావు

106 సెక్షన్‌ కింద... 

దస్త్రాల దహనంపై పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106 కింద కేసు నమోదు చేశారు. సమీర్‌ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు, డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ రూపేంద్రలను స్టేషన్‌కు పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. దస్త్రాల్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీసీబీ అధికారుల వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముందుకు వెళ్లనుంది. 


సమీర్‌శర్మే తగలబెట్టించారు
- మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ 

పీసీబీ దస్త్రాల్ని తన డ్రైవర్‌ నాగరాజు ద్వారా అప్పటి ఛైర్మన్‌ సమీర్‌శర్మ తగలబెట్టించారని తెదేపా నేత, మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన దస్త్రాల్ని కాల్చేసినంత మాత్రాన వైకాపా నేతలు, వారితో అంటకాగిన అధికారులు చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా పీసీబీ మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ, వాసుదేవరెడ్డి లాంటి వారు అప్రూవర్‌లుగా మారి... జే గ్యాంగ్‌తో కలిసి చేసిన అరాచకాల్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా   కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 


వెంటనే నివేదిక ఇవ్వండి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

దస్త్రాల దహనంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీసీబీలో దస్త్రాలు, రికార్డులు, వాటి నిర్వహణ, భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధివిధానాలపై వెంటనే నివేదిక ఇవ్వండి. జోనల్, రీజనల్‌ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణపై దృష్టిపెట్టండి. వాటి భద్రతపై తనిఖీ చేయండి’ అని అధికారులను ఆదేశించారు. 


పూర్తిస్థాయి విచారణ చేయిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర 

దస్త్రాల దహనంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. మచిలీపట్నంలో గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా హయాంలో అవినీతి, అక్రమాలతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి ప్రజాధనం దోచుకున్నారని, ఆ పాపాల్ని కనిపించనీయకుండా చేసేందుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రాథమిక సమాచారం మేరకు... దస్త్రాల్ని మాయంచేసే కుట్రలో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. లోతైన దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని