Peddireddy: పెద్దిరెడ్డి చెబితే ఉద్యోగం.. 400 మందిని వేలకు వేలు జీతాలిచ్చి మేపారు!

మొన్నటి వరకు గనుల శాఖను వెలగబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిల నుంచి సిఫార్సు లేఖ తీసుకెళ్తే చాలు.. ఇంటర్మీడియట్‌ పాసైనవాళ్లకు కూడా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు ఇచ్చేశారు.

Updated : 13 Jun 2024 07:49 IST

అర్హతలు, రిజర్వేషన్లతో పనిలేదు
పలుకుబడిని బట్టి ఇష్టానుసారం ఇంక్రిమెంట్లు
కాంట్రాక్ట్‌ ఉద్యోగాల పేరిట ఐదేళ్లుగా ఏపీఎండీసీలో దందా

ఈనాడు - అమరావతి: మొన్నటి వరకు గనుల శాఖను వెలగబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిల నుంచి సిఫార్సు లేఖ తీసుకెళ్తే చాలు.. ఇంటర్మీడియట్‌ పాసైనవాళ్లకు కూడా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరికి ప్రతి నెలా రూ.60, 70 వేలు జీతాలు చెల్లించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు, అటెండర్లు.. ఇలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో గత ఐదేళ్లలో ఉద్యోగాల జాతరే కొనసాగింది. మొత్తంగా 400 మందిని కాంట్రాక్ట్, పొరుగుసేవల విధానంలో తీసుకున్నారు. వీరిలో 80 శాతానికి పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లావారే. మరో 10 శాతం మందికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సిఫార్సుతో ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ఐదేళ్లపాటు ఏపీఎండీసీని తమ వారికి ఉపాధి కల్పన కేంద్రంగా మార్చేసి.. సంస్థ సొమ్మును భారీగా వృథా చేశారు.

50 నుంచి 400కి పెంచేశారు..

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి జేబు సంస్థలా మార్చుకున్నారు. తమకు తెలిసినవారు, వైకాపా నేతల కుటుంబీకులు, బంధువులకు ఏపీఎండీసీని ఉపాధి కేంద్రంగా మార్చారు. 2019కి ముందు సంస్థలో 50 మంది మాత్రమే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉండేవారు. జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రి, ఆయన కుమారుడు.. సంస్థకు ఎలాంటి అవసరాలు లేకపోయినా సరే వందల మందిని నియమించేలా చూశారు. నిబంధనల ప్రకారం ప్రతి పోస్టుకు ఓ అర్హత ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించి.. దాని ప్రకారమే ఉద్యోగులను నియమించాలి. ఇదేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. దీనికి తొలుత ఎండీగా వ్యవహరించిన మధుసూదన్‌రెడ్డి, తర్వాత ఇన్‌ఛార్జి ఎండీగా ఉన్న వీజీ వెంకటరెడ్డి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా.. చిత్తం ప్రభూ అంటూ అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం నాలుగు అంతస్తుల్లో ఉండగా.. తొలి మూడు అంతస్తుల్లోనూ వందల మంది ఉద్యోగులు ఎటువంటి పని లేకుండా, కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేకుండా, సెల్‌ఫోన్లు చూసుకుంటూ తచ్చాడుతూ ఉంటారంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

విధులకు రాకపోయినా జీతాలే

పదుల సంఖ్యలో ఉద్యోగులు.. చాలాకాలంగా ఏపీఎండీసీలో విధులకే హాజరుకాలేదు. కొందరు సీఎంఓలో, మరికొందరు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైకాపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. కొందరు ఉద్యోగులు తిరుపతిలో మంత్రి, మిథున్‌రెడ్డిలకు సహాయకులుగా ఉన్నారు. వీరు కార్యాలయం ముఖం చూడకపోయినా సంస్థ మానవ వనరుల విభాగం కళ్లు మూసుకుంది. చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడైన పి.హేమంత్‌కుమార్‌రెడ్డి ఈ సంస్థలో మేనేజర్‌. అతనికి రూ.70 వేలు జీతం ఇచ్చేవారు. తిరుపతిలో మంత్రి వ్యవహారాలు చూసే తేజేష్‌రెడ్డికి రూ.70 వేలు జీతం ఇస్తూ వచ్చారు. ఇంటర్మీడియట్‌ చదివిన సాయిప్రశాంత్‌కు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు ఇచ్చి రూ.70 వేలు జీతం ఇచ్చారు. వీళ్లు సోషల్‌ మీడియాలో వైకాపా తరఫున ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. వీళ్లు ఎలా ప్రచారం చేస్తారంటూ మార్చిలో ‘ఈనాడు’ కథనం ప్రచురితమైంది. దీంతో ఆ ముగ్గురినీ తొలగించారు. అంతకు ముందు వరకు వీళ్ల వ్యవహారం అధికారులు తెలియదనుకుంటే పొరపాటే. మంత్రి, ఎంపీ సిఫార్సుతో ఉద్యోగాలు పొందినవారికి అధికారులు రెండు, మూడుసార్లు ఇంక్రిమెంట్లు ఇచ్చి మరింత సహకారం అందించారు.

విచారించి.. కక్కించాల్సిందే: గత ఐదేళ్లలో ఏపీఎండీసీలో జరిగిన ప్రతి పరిణామం, నియామకంపై విచారణ జరిపి, సంస్థకు జరిగిన నష్టాలను వెలికితీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సిఫార్సులతో ఉద్యోగాలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇంతకాలం పనీపాటా లేకుండా జీతాలు పొందిన వారి నుంచి వాటిని రికవరీ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.


సంస్థ అధికారులొద్దు.. బయటివారే ముద్దు

జగన్‌ ప్రభుత్వం.. తమవారి కోసం ఏపీఎండీసీకి చట్టసవరణ చేసి కార్పొరేట్‌ సంస్థగా మార్చేసింది. బీచ్‌ శాండ్, కోల్, మినరల్స్‌ విభాగాలకు వైస్‌ ప్రెసిడెంట్స్‌ అనే పోస్టులు తీసుకొచ్చారు. ఈ పోస్టుల్లోకి వెళ్లేందుకు సంస్థ శాశ్వత ఉద్యోగులైన జనరల్‌ మేనేజర్లు ప్రయత్నిస్తే.. వారికి అవకాశం కల్పించలేదు. బీచ్‌శాండ్‌కు ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసిన  సీనియర్‌ను తీసుకొచ్చి వైస్‌ ప్రెసిడెంట్‌ను చేశారు. ఆయన ఆ కార్పొరేట్‌ సంస్థకు బీచ్‌ శాండ్‌ లీజుల టెండరు దక్కేలా చూసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కోల్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా కోల్‌ ఇండియాలో రిటైరయిన అధికారిని తీసుకొచ్చారు. ఇక మినరల్స్‌ విభాగానికి ఏపీఎండీసీ ఈడీగా రిటైరయిన ఓ అధికారి వచ్చే అవకాశం ఉండటంతో ఆయనకు ఛాన్స్‌ లేకుండా అర్హత నిర్ణయించారు.

  • ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసిన అధికారిని తీసుకొచ్చి ఏపీఎండీసీకి సలహాదారుగా నియమించారు. 
  • కేంద్ర మైన్‌ సేఫ్టీ విభాగంలో రిటైరయిన మరో అధికారిని కూడా ఏపీఎండీసీలో సలహాదారుగా నియమించారు. ఎంపీ మిథున్‌రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ అవకాశం దక్కింది. కేవలం సలహాదారు హోదాలో జీతం తీసుకొని అనుభవించడమే ఆయన పని అని ఏపీఎండీసీ వర్గాలు చెబుతుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని