Peddireddy: పెద్దిరెడ్డి మార్క్‌.. అరాచక సెటిల్‌మెంట్లు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒకరికి 40 ఏళ్లుగా చైనా క్లే అనే ఖనిజం లీజు ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. రైతులను ఎర్రిపప్పలు అని వ్యాఖ్యానించిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కన్ను ఈ లీజుపై పడింది.

Updated : 15 Jun 2024 06:45 IST

బలవంతంగా లీజులు లాక్కొని.. వైకాపా నేతలపరం
తక్కువ ధరతో అల్లుడికి గ్రానైట్‌ మెటీరియల్‌ ధారాదత్తం
అంగీకరించని లీజుదారులపై అన్నివిధాల వేధింపులు

ఈనాడు-అమరావతి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒకరికి 40 ఏళ్లుగా చైనా క్లే అనే ఖనిజం లీజు ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. రైతులను ఎర్రిపప్పలు అని వ్యాఖ్యానించిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కన్ను ఈ లీజుపై పడింది. వెంటనే అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు. ఇంకేముంది.. పెద్దిరెడ్డి తనదైన శైలిలో సెటిల్‌మెంట్‌ చేశారు. లీజుదారును పిలిపించి.. అందులో సగభాగాన్ని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అప్పటి మంత్రి కుటుంబీకుల పేరిట బదలాయించాలని హుకుం జారీచేశారు. అలాగైతేనే లీజు రెన్యువల్‌ చేస్తామని తెగేసి చెప్పారు. లీజుదారు గగ్గోలు పెడితే ఇంకా సగం ఉంటుంది కదా.. దాంతో సరిపెట్టుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కనీసం ఆ లీజులో అభివృద్ధి చేసిన భాగాన్ని తాను తీసుకుంటానని వేడుకున్నా పెద్దిరెడ్డి ఏమాత్రం కనికరించలేదు. అప్పటికే అభివృద్ధి చేసిన భాగాన్ని సదరు మంత్రికి దక్కేలా చేశారు. ఇద్దరు మంత్రులను ఎదుర్కొనే సాహసం చేయలేని ఆ లీజుదారు తన 44 ఎకరాల లీజులో సగం బదలాయించారు. 

ఇది గత ప్రభుత్వంలో అరాచక ‘ఘనుడు’ పెద్దిరెడ్డి మార్క్‌ దందాకు ఓ నిదర్శనం. ఇప్పటికీ ఆ లీజుదారు ఈ విషయాన్ని బయటపెట్టే సాహసం చేయడంలేదు. కానీ ఈ అన్యాయాన్ని కళ్లారా చూసిన కొందరు మైనింగ్‌ అధికారులే దీనిని వెలుగులోకి తెస్తున్నారు.

ఐదేళ్లపాటు గనులశాఖను ఏలిన మంత్రి పెద్దిరెడ్డి చేసిన దందాలు, దౌర్జన్యాల్లో.. కొన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి. వైకాపా నేతలకు అడ్డగోలుగా మేలు జరిగేలా అనేక నిర్ణయాలు తీసుకొని.. ఇతర లీజుదారులను అన్ని విధాలా దెబ్బతీశారు. పలు జిల్లాల్లో కీలక వైకాపా నేతలు సిండికేట్లుగా ఏర్పడి ఖనిజ సంపదను దోచుకున్నా సరే.. ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. మంత్రి చెప్పినట్లు తలాడించేలా ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వీజీ వెంకటరెడ్డిని డైరెక్టర్‌గా నియమించుకొని యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. పెద్దిరెడ్డి చెప్పినట్లు వినని లీజుదారులపై గనులశాఖ, విజిలెన్స్‌ విభాగంతో వేధింపులకు పాల్పడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్‌పరంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను పూర్తిగా ఊడ్చేసింది. ఆ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పెద్దఎత్తున రోడ్లు, వంతెనలు, హైవేలు, జలాశయాల పనులు చేపట్టగా.. వాటికి అక్రమంగా తవ్విన మైనింగ్‌ మెటీరియల్‌ వినియోగించారు. అల్లుడికి భారీగా లబ్ధి కలిగేలా గ్రానైట్‌ లీజుదారులను బెదిరించి వ్యాపారం చేశారు. వాళ్లు చేసిన దోపిడీ తెలిసినాసరే ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టారు.

అరాచకాల్లో మచ్చుకు కొన్ని.. 

  • జగన్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లాలో గ్రానైట్‌ లీజుదారులంతా తవ్వి తీసిన మెటీరియల్‌ను పెద్దిరెడ్డి అల్లుడికి చెందిన ఎక్స్‌పోర్ట్‌ కంపెనీకే ఇవ్వాలని హుకుం జారీచేశారు. మంత్రి వెనుక ఉండే కీలక అనుచరుడైన శశి ఈ ప్రతిపాదన తెచ్చారు. లీజుదారులంతా దానిని పాటించాల్సిందేనని గనులశాఖ అధికారులు చెప్పారు. మార్కెట్‌ ధర కంటే క్యూబిక్‌ మీటరుకు రూ. 10,000 తగ్గించుకొని ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. అంత తగ్గిస్తే తమకు మిగిలేది ఏమీ ఉండదంటూ వారు గగ్గోలుపెట్టినా పట్టించుకోలేదు. ఐదేళ్లుగా ఇలాగే ఏకపక్షంగా దోచుకున్నారు.
  • పెద్దిరెడ్డి అల్లుడికి గ్రానైట్‌ మెటీరియల్‌ ఇవ్వబోమని చెప్పినవారిపై గనులశాఖ ఆధ్వర్యంలో దాడులు జరిపించి, జరిమానాలతో వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన పులివర్తి నాని గంగాధర నెల్లూరు మండలంలో తనకున్న గ్రానైట్‌ లీజు నుంచి అప్పట్లో మెటీరియల్‌ ఇవ్వకపోవడంతో వివిధ సాకులు చూపించి రూ. 50 కోట్ల జరిమానా విధించారు. 
  • తెదేపా నేత మోహన్‌నాయుడికి యాదమర్రి మండలంలో గ్రానైట్‌ లీజు ఉంది. ఆయన కూడా పెద్దిరెడ్డి అల్లుడికి తక్కువ ధరతో మెటీరియల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తొలుత రూ. 22 కోట్లు జరిమానా విధించారు. ఆయన కోర్టుకు వెళ్లడంతో లీజుదారుకు మైనింగ్‌ చేసే ఆసక్తి లేదని అధికారులే నిర్ణయించేసుకొని ఏకంగా లీజునే రద్దు చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించినా.. ఇప్పటివరకు వేధింపులు కొనసాగిస్తూనే వచ్చారు.
  • పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులోని పాలెంపల్లి వద్ద సర్వే నంబరు 593, 595ల్లో.. పుంగనూరుకు చెందిన ఆర్వీటీ బాబు మరో ఇద్దరు 10 హెక్టార్లలో కలర్‌ గ్రానైట్‌ లీజు కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు. ఆ లీజు ప్రాంతంలో 33 కేవీ విద్యుత్‌ లైన్లు ఉండడంతో పెద్దఎత్తున డబ్బులు ఖర్చుచేసి, వాటిని అక్కడి నుంచి మార్పించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. లీజు మంజూరు చేయకుండా ఆపేశారు. కానీ అక్కడున్న గ్రానైట్‌ను పెద్దఎత్తున బ్లాస్టింగ్‌ చేసి, పక్కనే ఉండే పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ క్రషర్స్‌లో కంకరగా మార్చి.. నిర్మాణ పనులకు వినియోగించుకున్నారు. తాము లీజుకు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలో అక్రమంగా తవ్వేస్తున్నారంటూ ఆ ముగ్గురు వ్యక్తులు గనులశాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. 
  • మదనపల్లె పరిధిలోని అనేక రహదారి కంకర క్వారీల యజమానులను వేధించారు. 
  • ఇవి కాకుండా ఇంకా వెలుగుచూడని అరాచకాలు ఎన్నో ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని