Pending bills: హోరెత్తిన చెరకు పోరు

చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై మూడోరోజు శుక్రవారం విజయనగరం జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈనెల 3న రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే

Updated : 24 Sep 2022 16:27 IST

ముందస్తు అరెస్టులు...నిరసనలు
మూడో రోజూ ‘ఎన్‌సీఎస్‌’ ఆందోళన
విజయనగరం జిల్లాలో ఆగని లచ్చయ్యపేట బకాయిల చిచ్చు

బొబ్బిలిలో ఆందోళనకారులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

బొబ్బిలి, సీతానగరం, న్యూస్‌టుడే: చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై మూడోరోజు శుక్రవారం విజయనగరం జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈనెల 3న రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు సీజన్ల  బకాయిలు రూ.16.33 కోట్ల చెల్లింపులపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో శుక్రవారం పార్వతీపురం డివిజన్‌లో బంద్‌ నిర్వహించేందుకు వామపక్ష, ప్రజాసంఘాలు పిలుపు నిచ్చాయి. వారికి మద్దతుగా తెదేపా, జనసేన నాయకులు రహదారులపైకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా వామపక్ష, జనసేన నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. తెదేపా, జనసేన, సీపీఎం, సీపీఐ, నాయకులు సీతానగరం, కర్మాగారం వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. అయితే తొలుత జనసేన నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ నేతృత్వంలో సీతానగరం హనుమాన్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు పార్వతీపురం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొబ్బిలి చిరంజీవులు, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి జి.వెంకటరెడ్డి నేతృత్వంలో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. జనసేన నాయకులు బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని గ్రామీణ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కర్మాగారాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మందస్తు అరెస్టులతో కట్టడి చేసినా జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 80 మందిని అరెస్టు చేశారు. జనసేన రాజకీయ వ్యవహరాల రాష్ట్ర కార్యదర్శి యశస్వి, పార్వతీపురం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, మండల కార్యదర్శి పోతల శివశంకర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణలతో పాటు పలువురు కార్మిక నాయకులు, తెదేపా మండల స్థాయి నాయకులను అరెస్ట్‌ చేసి తరవాత విడుదల చేశారు.


ఫ్యాక్టరీ భూములు అమ్మి చెరకు బకాయిలు చెల్లిస్తాం: బొత్స

విజయనగరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ కు చెందిన భూములను వేలం ద్వారా అమ్మి సంబంధిత రైతులకు బకాయిల కింద చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లిస్తామని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. చెరకు బకాయిల కోసం కొన్ని రోజుల క్రితం జిల్లాలో జరిగిన ఆందోళన నిజమైన రైతులు చేసింది కాదని చెప్పారు. నిజమైన రైతులను తాము అరెస్టు చేయలేదని, అటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే శుక్రవారం ముందస్తు అరెస్టులు చేశామని వెల్లడించారు. ఎన్‌సీఎస్‌ షుగర్స్‌కు చెరకు ఇచ్చిన రైతులకు గత రెండు సీజన్లతో కలిపి రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, వీటి చెల్లింపునకు కర్మాగారానికి చెందిన సుమారు 24 ఎకరాలను స్వాధీనం చేసుకొని వేలం వేస్తామని తెలిపారు. రూ.10 కోట్ల విలువైన 30 వేల బస్తాల పంచదారను ఇప్పటికే ప్రభుత్వం సీజ్‌ చేసిందని చెప్పారు. 2015 నుంచి పేరుకుపోయిన రూ.27.80 కోట్ల బకాయిలను... కర్మాగార భూములు విక్రయించి 2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని