AP-TG CMs Meeting: కమిటీల ద్వారా పరిష్కారం

విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు తెలిపారు.

Published : 07 Jul 2024 05:02 IST

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి సత్యప్రసాద్‌ 

విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు తెలిపారు. ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను వారిద్దరు ఇతర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దుర్గేశ్, బీసీ జనార్దన్‌రెడ్డిలతో కలిసి వెల్లడించారు. ‘‘గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించాం. సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేం భావించలేదు. వాటిని కొలిక్కి తెచ్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది. అందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చాం. సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో పరిష్కారం చూపాలని నిర్ణయించాం. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని రెండు వారాల్లో వేయాలని నిర్ణయించాం. వీరిస్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వేయాలని తీర్మానించాం. మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపుతారు. మంత్రుల స్థాయిలో తేలని వాటికి ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కారమార్గాలు కనుగొంటారు. డ్రగ్స్, సైబర్‌ నేరాల కట్టడికి ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం. వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పని చేయాలని నిర్ణయించాం. యాంటీ నార్కోటిక్స్‌ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అడిషనల్‌ డీజీ స్థాయి అధికారితో ప్రతిష్ఠాత్మకంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. సైబర్‌ నేరాలకు సంబంధించి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్‌ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి, సమన్వయంతో పనిచేస్తాం’’ అని భట్టి వివరించారు.


ఇది తెలుగుజాతి హర్షించే రోజు: అనగాని సత్యప్రసాద్‌ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగిన ఈ రోజు తెలుగుజాతి హర్షించే శుభదినమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వర్ణించారు. ‘‘విభజన సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం శుభపరిణామం. భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా కూలంకషంగా చర్చ జరిగింది. ఏపీలో గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించాం. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల పరిష్కారంతోపాటు రానున్న రోజుల్లో ఇరురాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడటానికి ఈ సమావేశం దోహదం చేస్తుంది. సమన్వయంతో పనిచేసి మాదక ద్రవ్యాలను అరికట్టి, తెలుగుజాతిని కాపాడతాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని