Polavaram project: పోలవరం ప్రాజెక్టులో కదలిక

ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే  ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు.

Updated : 23 Jun 2024 06:49 IST

అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారు
తొమ్మిది రోజుల పాటు అక్కడే మకాం
సాంకేతిక సవాళ్లకు దశ-దిశ అన్వేషణ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే  ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు ఆ చెందిన నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు. 

వీరు జూన్‌ 27 నుంచి జులై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు మూడు నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యేవరకూ సాంకేతికంగా అండదండలు అందిస్తారు.

అంతర్జాతీయ నిపుణులు.. వారి ప్రావీణ్యం

1. డేవిడ్‌ బి.పాల్‌ (యూఎస్‌ఏ): డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ    డ్యాం భద్రతా సంస్థలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు.

2. రిచర్డ్‌ డోన్నెల్లీ (కెనడా): సివిల్‌ ఇంజినీరింగ్, ప్రధానంగా హైడ్రాలిక్‌ నిర్మాణాలు, నీటివనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది.

3. గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో (ఫ్లోరిడా, యూఎస్‌ఏ): పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వహణ, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. అడ్వాన్స్‌డ్‌ స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్‌లో చీఫ్‌ ఇంజినీరు.

4. సీస్‌ హించ్‌బెర్గర్‌ (కెనడా): జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్,  నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. జియోటెక్నికల్‌ కన్సల్టెంట్‌.

ప్రస్తుత సవాళ్లు 

ఎగువ కాఫర్‌ డ్యాంలో అధిక సీపేజీ వస్తోంది. అది కట్టడం భవితవ్యానికి సవాలుగా ఉంది. ఫలితంగా ఆ కట్టడం ఆధారంగా చేసుకునే పనులకు అవాంతరం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు దీన్ని అధ్యయనం చేసిన వారు ఇక్కడ రసాయనిక గ్రౌటింగ్‌ చేయాలని సిఫార్సు చేశారు. ఫిజోమీటర్లు ఏర్పాటుచేసి నిరంతరం సీపేజీని అంచనా వేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఈ అంశాలు పరిశీలించి పరిష్కారం సిఫార్సు చేయాలి.

  • ప్రధాన డ్యాంలో భాగంగా గోదావరి నదీగర్భంలో కట్‌ ఆఫ్‌ వాల్‌గా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎంతో కీలకం. 2020 భారీ వరదల్లో ఇది ధ్వంసమయింది. దీనికి మరమ్మతులా, కొత్తగా మళ్లీ నిర్మించాలా అన్నది వీరు తేల్చాల్సి ఉంది.
  • నదీగర్భం కోత తదితర అంశాలను పరిష్కరించాలి. ప్రధాన డ్యాం నిర్మించేచోట ఉన్న ఈ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది.  వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్‌కాలమ్‌ల ఏర్పాటు అంశాన్ని సమీక్షించి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు